నెల్లూరు : గిరిజనులకు భగవంతుడిని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తిరుమల
తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో నూతన
ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి
గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఎస్టీ
కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో సమరసత
సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి
గోవర్ధన్ రెడ్డి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి
గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
గిరిజనులకు భగవంతుడిని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎన్నడూ లేనివిధంగా
గిరిజన కాలనీల్లో ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తిరుమల
తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో గిరిజన కాలనీల్లో
ఒక్కొక్క దేవాలయం10 లక్షల రూపాయలతో నిర్మించేలా మొదటి విడతగా 111 దేవాలయాలు
మంజూరు చేయగా సర్వేపల్లి నియోజక వర్గంలో 7 దేవాలయాలు మంజూరు కావడం
జరిగిదన్నారు. ప్రాధాన్యత క్రమంలో గిరిజన కాలనీలను గుర్తించి దేవాలయాలను
నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నిధులు
కొరత ఉండదని, ఈ రోజు భూమి పూజ చేసుకున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ
నిర్మాణాన్ని మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసుకొని ప్రారంభించుకోవడం
జరుగుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో 60 ఆలయాలకు ధూప దీప నైవేద్యం పథకం
ద్వారా ఒక్కొక్క ఆలయానికి నెలకు ఐదు వేల రూపాయలను ఇస్తుండగా, మరో 110 ఆలయాలను
మొత్తం జిల్లాలో 170 ఆలయాలను ఈ పథకం కింద గుర్తించామన్నారు. ఆలయానికి దూప దీప
నైవేద్యానికి రూ. 5,000 నుంచి రూ 10,000 పెంచి ప్రతి నెలా ఇచ్చేలా చర్యలు
తీసుకోవడం జరుగు చున్నదన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో
త్రాగునీరు, సాగునీరు, విద్యుత్, సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు వంటి ఎన్నో
అభివృద్ది కార్యక్రమాలతో పాటు పేదల సంక్షేమానికి వివిధ సంక్షేమ కార్యక్రమాలను
అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు సుబ్రమణ్యం, సర్పంచ్ రాజేశ్వరమ్మ, సమరసత
సేవా ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.