ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : దిశ యాప్ మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన
అస్త్రం. ఆధునిక సమాచార సాంకేతికతతో రూపొందించిన ఈ యాప్ మహిళల భద్రతకు పూర్తి
భరోసానిస్తోందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి
రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు.
రికార్డు స్థాయిలో ఈ యాప్ ను మహిళలు డౌన్లోడ్ చేసుకుంటుండటమే ఇందుకు
నిదర్శనమని అన్నారు. ఇప్పటి వరకు 1.10 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని
తెలిపారు. మహిళలకు అండగా నిలిచే దిశ యాప్ వ్యవస్థపై జాతీయ స్థాయిలో పెద్ద
ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. 23 వేలకు పైగా కాల్స్ కు
తక్షణం స్పందించడం జరిగిందని, 3560 ఘటనల్లో బాదితులకు పోలీసులు అండగా
నిలిచారని, 2323 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సంబంధించిన తేదీలు ప్రకటించడంతో పలు అంశాలపై తన
వాణిని వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోందని విజయసాయి
రెడ్డి తెలిపారు. మహిళల భద్రత, ఉద్యోగ, ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం, రైలు,
రోడ్డు, విమాన మార్గాలకు చెందిన మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, మత్స్య సంపద
ఉత్పత్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా మొదలగు అంశాలపై పార్లమెంటులో తమ వాణికి గట్టిగా
వినిపిస్తామని అన్నారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం మెదలగు సామాజిక
మాధ్యమాల యాజమాన్య సంస్థ మెటా ఇండియాకు హెడ్ గా, వైస్ ప్రెసిడెంట్ గా ఆంధ్ర
యూనివర్శిటీ పూర్వవిద్యార్ధి సంధ్య దేవనాథన్ నియమింపబడడం ఎంతో గర్వించదగ్గ
విషయమని , ఈ మేరకు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నానని విజయసాయి రెడ్డి
తెలిపారు. ఆయా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను, కథనాలకు
కట్టడి చేయాలని, నైపుణ్యం కల్గిన భారతీయులను మెటా ఇండియాలో ఉద్యోగ అవకాశాలు
కల్పించాలని కోరారు.