అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ
జిల్లాల్లో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు సమస్యల
పరిష్కారంలో ప్రజలకు పార్టీ స్థానిక నాయకత్వం అండగా నిలబడే విధంగా పార్టీని
పటిష్టపరచడంపై ఒక కార్యాచరణను రూపొందించామని జన సేన పార్టీ అధ్యక్షులు పవన్
కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యాచరణను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. విజయనగరం
జిల్లాతో ఈ కార్యాచరణను అమలులోకి తీసుకువస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 22వ
తేదీ నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్
నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో
కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, వారి ఆలోచనలను తెలుసుకుంటారు. ముఖ్యంగా
విజయనగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని గుంకలాంలో పేదవారి కోసం నిర్మాణం
జరగవలసిన ప్రాంతాన్ని ఈ నెల 13 వ తేదీన సందర్శించిన సందర్భంలో అనేకమంది
యువకులతో మాట్లాడాను. ఒకటి కాదు రెండు కాదు. జిల్లాను ముప్పిరిగొన్న సమస్యలను
వారు ఆవేదనతో, ఆగ్రహంతో వివరిస్తున్నప్పుడు కలత చెందాను. ఉపాధి కరవై వలసలు,
పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, రైతు కడుపు నింపని వ్యవసాయం ఈ ప్రాంతాన్ని
పట్టి పీడిస్తున్నాయి. దీనికి తోడు ఒకప్పుడు జిల్లాకే తలమానికంగా ఉన్న జ్యూట్
పరిశ్రమలు మూతపడ్డాయి. ఉన్న ఒక్కగానొక్క చక్కెర కర్మాగారం భీమసింగికి సైతం
తాళాలు పడ్డాయి. తోటపల్లి నిర్వాసితుల సమస్యలు, రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్
పనులు ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. గిరిజన విద్య మిధ్యగా మారింది. గిరిజనులు
ఆస్పత్రులకు వెళ్లాలంటే మంచాలనే డోలీలుగా మార్చి మోసుకుపోవలసిందే. ఇవి కొన్ని
మచ్చుకు మాత్రమే. ఇవన్నీ నిజానికి పరిష్కరించలేని సమస్యలు కావు.
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మంచి చేయాలనే తలంపు, చిత్తశుద్ధి లేకపోవడమే.
జనసేన పార్టీని ఈ ప్రాంతంలో పటిష్టంగా రూపొందిచడం ద్వారా మాత్రమే ఇటువంటి
సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున బలమైన పోరాటం చేయవచ్చని
భావిస్తున్నాను.13వ తేదీన నేను విజయనగరంలో పర్యటనకు వచ్చిన సందర్భంలో నా
వెన్నంటి నడచిన లక్షలాదిమందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు
చూపే అనంతమైన అభిమానానికి ప్రతిగా ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచనలేని కృషి
సల్పుతానని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.