ఎంపి విజయసాయిరెడ్డి
విజయవాడ : ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రజాసామ్యం మీద గౌరవం లేదని
వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభ
సభ్యులు విజయసాయిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. కర్నూలు జిల్లా
ఎమ్మిగనూరు ‘రోడ్ షో’లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు వింటే ఆయన
ఆలోచనా ధోరణి సజావుగా లేదనిపిస్తుందని తెలిపారు. గురువారం తన ప్రసంగంలోని
‘విసుర్ల’తో జనంలో ఆయన కొత్త ‘అలజడి’ సృష్టించారు. ‘అన్నేళ్లు ఎమ్మెల్యేగా,
ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడేనా? ఈ నాయుడు గారు!’ అనే రీతిలో ఆయన
రెచ్చిపోయారు. భారత రాజ్యాంగంపై ఈ మాజీ హైటెక్ సీఎంకు ఏమాత్రం గౌరవం లేదని
ఆయన మాటలు మరోసారి నిరూపించాయన్నారు. ‘ఈ అసెంబ్లీ గౌరవ సభ కాదు. కౌరవ సభ.
మళ్లీ మీ మద్దతుతో ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే అసెంబ్లీలో అడుగుపెడతా,’ అన్న
చంద్రబాబు మాటలు చట్టసభల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపారు.
రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారం దాదాపు మూడున్నరేళ్ల క్రితం ఎన్నికల ద్వారా
ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభను ‘కౌరవ సభ’ అని మూడుసార్లు సీఎంగా
పనిచేసిన నారా వారు అభివర్ణించారంటే ఏమనుకోవాలి? 72 ఏళ్ల ‘రాజకీయ అనుభవశాలి’
ఇప్పటి యువతరానికి ఇచ్చే సందేశం–చట్టసభలను కించపరుస్తూ మాట్లాడమనేనా? మెజారిటీ
సభ్యులు ఉన్న రాజకీయపక్షమే పాలకపక్షం అవుతుందని భారత రాజ్యాంగం చెబుతోంది.
మరి, అత్యధిక మెజారిటీ ఉన్నంత మాత్రాన ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ‘కౌరవ సభ’ ఎలా
అవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు తెలుగుదేశం నేత నుంచి జవాబులు ఆశించడం అత్యాశే అవు
తుందన్నారు. ఎమ్మిగనూరు రోడ్ షోలోనే చంద్రబాబు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన
శాసనసభను కించపరుస్తూ మాట్లాడి ఊరుకోలేదు. ఆ సభకు సభ్యులను అఖిలాంధ్ర ప్రజలు
ఎలా ఎన్నుకున్నారో ఆయన చాలా చౌకబారు ధోరణిలో, అసభ్యంగా వ్యాఖ్యానించారని
మండ్డిపడ్డారు. అసెంబ్లీపై అలిగిన ఈ ప్రతిపక్ష నేత
ఓటర్లను అవమానించే విధంగా నోరు పారేసుకున్నారని చెప్పారు.
‘‘2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఊళ్లన్నీ తిరుగుతూ ప్రస్తుత
ముఖ్యమంత్రి మీకు ముద్దులు పెట్టేశారు. మీరేమో ఆయనకు ఓట్లేసి గెలిపించారని
చంద్రబాబు అన్న మాటలు ఆయన మానసిక స్థితిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని
అన్నారు. ఓ రాజకీయ పార్టీ నాయకుడు జనం మధ్యలోకి వచ్చి తనను అభిమానించే ప్రజలను
తన పాదయాత్రలో ముద్దులు పెట్టుకున్నంత మాత్రాన వారు ఓట్లేస్తారా? అంటే–
వేస్తారని టీడీపీ అధినేత ‘ఎత్తిపొడుపు మాటలు’ సూచిస్తున్నాయి. వాస్తవం ఏమిటో
తెలుగు ప్రజానీకానికి, చంద్రబాబుకు తెలుసాని చెప్పారు. ఐదేళ్ల తెలుగుదేశం
పాలనతో విసిగిపోయిన ఏపీ జనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలపై నమ్మకంతో ఓట్లేసి, భారీ
మెజారిటీ అందించారు. ఈ రాజకీయ సత్యాన్ని మనసులో దాచుకున్న టీడీపీ నేత ప్రజలను
ఎగతాళి చేసేలా ఎమ్మిగనూరులో ప్రసంగించడం ఏమాత్రం సబబు కాదని
విజయసాయిరెడ్డి అన్నారు.