పప్పు నాయుడుతో కలిసి చేసుకున్నచీకటి ఒప్పందం కాదా అది?
మాజీ మంత్రి పరిటాల సునీతపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపాటు
“మహానటీ.. ఆపు నీ నటన..! రూ.140 కోట్ల విలువైన భూమిని రూ. 3కోట్లకే
ఇచ్చినప్పుడు రూ. 15 కోట్లు లంచం అడిగితే ఇవ్వరా?. ఎందుకివ్వరు? మాజీ
నిప్పుమంత్రి (పరిటాల సునీత) జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?. నాకు ఎక్కడైనా
రూ.140 కోట్ల విలువైన భూమిని రూ. 3 కోట్లకే ఇప్పించండి…నేనే రూ.15 కోట్లు
లంచం ఇస్తా. 25 ఏళ్లు అధికారంలో ఉండికూడా మీరు చేసిందేమీ లేదు. కొంపలు కూల్చడం
తప్ప. రాప్తాడులో వాల్మీకులను మోసం చేసి భూములు లాక్కొన్నారు. గంగులకుంట
చెరువుకు నీళ్ళిస్తామని కురుబలను మోసం చేశారు. రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహం
పెడతామని చందా అడిగితే ఎందుకు ఇవ్వాలని దళితులను అవమానించారు. అదేమాట మాకు
చెబితే మా వాళ్ళతో మాట్లాడించి.. అంబేడ్కర్ విగ్రహం పెట్టించా. మాజీ
నిప్పుమంత్రి మూడేళ్ల నుంచి కనిపించకపోవడంతో అధిష్టానం సూచన మేరకు మెరుపుతీగలా
జనాల్లోకి వచ్చి మెరిసిపోతోంది” అంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రకాష్
రెడ్డి ఒత్తిళ్లతోనే రాప్తాడు సమీపంలో జాకీ కంపెనీ వెనక్కుపోయిందంటూ
మాజీమంత్రి పరిటాల సునీత చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. అనంతపురంలో
శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జిల్లాకు చెందిన ఒక మహానటి…
ఆమె మంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేష్ అనే ఒక నామినేటెడ్ నాయకుడు పరిశ్రమల
మంత్రిగా ఉండగా చేసుకున్న అనేక చీకటి ఒప్పందాలతో ప్రభుత్వ భూములను వివిధ
సంస్థలకు అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. పిల్లి పాలు తాగుతున్న చందంగా
వారే అవినీతి చేసికూడా అభివృద్ధి చేశాం. పరిశ్రమలు తీసుకొచ్చాం…వైసిపి
వచ్చిన తర్వాత అవన్నీ వెళ్లిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.
వీరు పదేపదే అపద్దాలను గోబెల్ ప్రచారం చేస్తున్నారన్నారు.
అనంతపురం నగర సరిహద్దుల్లోని రాప్తాడు వద్ద వాల్మీకులు సాగు చేసుకుంటున్న
భూములను సేకరించి వారికి ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా పేజ్ ఇండస్ట్రీస్
అనే సంస్థకు కట్టబెట్టారన్నారు. దాదాపు 140 కోట్ల విలువ చేసే 28 ఎకరాల భూమిని
కేవలం రెండు కోట్ల 80 లక్షలకు కట్టబెట్టారన్నారు. తరువాత పదేపదే జాకీ
వస్తోందని ప్రచారం చేశారన్నారు. ‘జాకీ అనేది అమెరికా సంస్థ. దాని అనుబంధ సంస్థ
పేజ్ ఇండస్ట్రీస్. పప్పు నాయుడు, అప్పటి నిప్పు మంత్రి ఇద్దరూ కలిసి చేసుకున్న
చీకటి ఒప్పందంలో భాగంగా ఎంఓయూ లేని కంపెనీలకు అప్పనంగా భూములు కట్టబెట్టారు.
బేరం కుదరని కారణంగా ఎంఓయూ జాబితాలోని 14 కంపెనీలకు భూములు కేటాయించలేదు. పేజ్
ఇండస్ట్రీస్ వారికి అప్పట్లో ధైర్యం లేకే పెట్టలేదు. ఎందుకంటే పప్పునాయుడు,
నిప్పుమంత్రితో చీకటి ఒప్పందం చేసుకున్నా…రేప్పొద్దున వీరు రాకపోతే ఇబ్బంది
పడతామనే ఆలోచించే కొద్దిరోజులు వేచి చూశారు. కనీసం కాంపౌండ్ కూడా
నిర్మించలేదు. అయితే ఫ్యాక్టరీ వచ్చి వెళ్లిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు.
అందుకు తామే కారణమంటూ చెబుతున్నారు. మీ ‘కమ్మ’ని మాటలు నాలుగైదు శాతం మందికి
తియ్యగా అనిపిస్తున్నాయి కాబట్టే వారు నమ్ముతున్నారు. కొంపలు కూల్చావు తల్లీ..
జాకీ కంపెనీ వస్తోందంటూ చిన్మయానగర్, రాప్తాడులో దాదాపు 200 ఇళ్లు
కూల్చేయించావు. వారందరికీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కాలనీల్లో
ఇంటిస్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇళ్లు కూల్చడంలో మీకు మీరే
సాటి.’ అన్నారు.
‘ఎన్టీఆర్ అంటే మాకందరికీ అభిమానమే. పేదవాడికి కూడు, గూడు కల్పించాలనే
ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనను మీరందరూ వెన్నుపోటు పొడిచి చంపారు.’ అని
విమర్శించారు.
‘ఈమె డ్రామాకు అడ్డూ అదుపు లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పౌరసరఫరాల
శాఖమంత్రిగా ఉన్నసమయంలో పంపిణీ చేసిన రంజాన్ తోఫా, చంద్రన్నకానుక సరుకులను ఏయే
కంపెనీలకు ఆమె ఇచ్చిందో వాటిమీద సీబీఐ, సీఐడీ విచారణ చేయించి నిజాయితీని
నిరూపించుకోమనండి’ అని తోపుదుర్తి పేర్కొన్నారు.
‘ పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా అడ్డుకున్న చరిత్ర మాజీ నిప్పుమంత్రిది. ఆమె
హయాంలో రామగిరి బంగారు గనులు మూయిస్తే మా హయాంలో తెరిపించేందుకు టెండర్లు
పిలిచాం. కొంపలు కూల్చడం తప్ప ఏరోజూ ఇల్లు కట్టింది లేదు. మహా అంటే మీ హయాంలో
3 వేల ఇళ్లు కట్టించారు. మేము 27 వేల ఇళ్లు మంజూరు చేయించాం. నిర్మాణాలు
జరుగుతున్నాయి. మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసు..’ అని
ప్రకాష్ రెడ్డి అన్నారు.