ఆదోనిలో రోడ్ షో
కర్నూలు : కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగింది.
గురువారం ఆదోనిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి
ప్రసంగించారు. “నేనేమీ సినిమా యాక్టర్ కాదు… నా సినిమా సూపర్ హిట్ కాలేదు.
కానీ కట్టలు తెంచుకుని జనం ఇక్కడికి వచ్చారు. మళ్లీ టీడీపీ రావాలి అని
సంఘీభావం తెలిపేందుకు వీరంతా వచ్చారు” అంటూ ఉద్వేగం ప్రదర్శించారు. ఈ
సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా విమర్శలు చేశారు. ఒక పెళ్లి
చేయాలంటే ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం, కానీ నాడు ఓట్లు వేసి
నష్టపోయాం అని పేర్కొన్నారు. తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారని
చంద్రబాబు వెల్లడించారు.
“మూడున్నరేళ్లలో అభివృద్ది ఆగిపోయింది… రౌడీయిజం పెరిగిపోయింది… దోపిడీ,
నేరాలు పెరిగిపోయాయి. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ కుటుంబ వివాదాన్ని
కానిస్టేబుల్ బెదిరించారు. దీంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు
చనిపోయారు. రౌతుకొద్దీ గుర్రం అంటారు… అందుకే పోలీసులు ఇలా అయ్యారు.
పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. పోలీసులకు జీతాలు రావడం లేదు….మీ పిల్లలూ
నష్టపోయారు. నా కర్నూలు పర్యటనలో వైసీపీ చోటానేతలు వేషాలు వేస్తే… పోలీసులు
చూస్తూ కూర్చున్నారు. ప్రజలు తిరగబడి మీ అంతు చూస్తే నాకు బాధ్యత లేదు… ఆపై
మీ ఇష్టం!” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
“చెత్తమీద పన్ను వేసే వారిని ఏమనాలి? మనం మరుగుదొడ్లు కట్టిస్తే వాటిపైనా
పన్ను వేస్తోంది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇసుక దొరుకుతోందా?. ఈ ఊళ్లో ఇసుక
కర్నాటక, హైదరాబాద్లో దొరుకుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారా. ఉంటే ఏం
చేస్తున్నారు? సాయంత్రానికి డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. మద్యం మాఫియాతో
దోపిడీ చేస్తున్నారు.
ఇసుక సొమ్ము, మద్యం సొమ్ము చాలడం లేదు… నకిలీ విత్తనాలతో పత్తిరైతులను
ముంచారు. నాడు తప్పు చేస్తే తాట తీస్తాను అని భయం ఉంది కాబట్టి అక్రమాలకు అంతా
భయపడ్డారు. కానీ నేడు ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారు.
పవన్ కళ్యాన్ విశాఖపట్నం పోతే అక్కడా ఇబ్బంది పెట్టారు. గుంటూరు జిల్లా
ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు వేస్తారా? బస్సు రాని ఊరికి 120 అడుగుల రోడ్డు
వేస్తారట! రేపు మేము కూడా వైసీపీ నేతల ఇళ్లపై రోడ్లు వెయ్యలేమా…ఫ్లైవోవర్ లు
కట్టలేమా? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే టీవీ చానల్స్ ను
అడ్డుకుంటున్నారు . తెలుగుదేశం బీసీల పార్టీ. వారికి నేను అండగా ఉంటా.
వాల్మీకి, కురబ, వడ్డెర, కమ్మరి, కుమ్మరి సహా అన్ని కులాలను ప్రభుత్వంలోకి
వచ్చాక ఆదుకుంటాను. యవతకు జగన్ ఇచ్చిన ఉద్యోగాలు మటన్ కొట్లో ఉద్యోగం,
వాలంటీర్ ఉద్యోగం…! కానీ నేను రైతుల పిల్లలు, కూలీల పిల్లలు కూడా ఐటీ
ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాను. యువత ఉద్యోగాలు అడిగితే గంజాయి
ఇస్తున్నారు. సంక్షేమం నిలిపివేస్తాను అని నాపై తప్పుడు ప్రచారం
చేస్తున్నారు. నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తాను” అని
చంద్రబాబు అన్నారు.