68 మంది ఎస్సీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
త్వరలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 500 మంది లబ్ధిదారులకు దళిత బంధు అమలు
ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి కొప్పుల పర్యటన
పెద్దపల్లి : దేశంలోనే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం
తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
గురువారం ధర్మారం మండలంలో పలు గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
పర్యటించారు. మల్లాపూర్ గ్రామంలో 25 లక్షలతో నిర్మించే ప్రాథమిక సహకార సంఘం
నూతన గోదాం నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పొందిన 68 మంది
లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
పత్తిపాక గ్రామంలో పర్యటించిన మంత్రి గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు
పనులను ప్రారంభించి ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
పత్తిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
దేశానికి ఆదర్శవంతంగా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు.
ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత
బంధు, కెసిఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
మాత్రమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా
గ్రామాలను అభివృద్ధి చేశామని, సీఎం కేసీఆర్ ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో
పచ్చదనం పారిశుధ్యం పెంపొందించామని, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల పనులు
పూర్తి చేశామని మంత్రి తెలిపారు.
దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మంచి ఫలితాలు
సాధించిందని, లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని మంత్రి
పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో ప్రతి
అసెంబ్లీ నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత బంధు పథకం
అమలు చేస్తామని, మరో 3 నెలల సమయంలో మరో విడత దళిత బంధు పథకం అమలు చేస్తామని
మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం తహసిల్దార్, ఎంపీడీవో,
ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.