తిరుపతి : నవంబర్ 18వ తేదీ తిరుపతి టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక
దీపోత్సవాన్నివిజయవంతంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని
జెఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై
జెఈవో బుధవారం టిటిడి పరిపాలనా భవనంలో అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా జెఈవో సదా భార్గవి మాట్లాడుతూ కార్తీక దీపోత్సవ విశిష్టతను
భక్తులకు తెలిపేందుకు, దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ
మహాలక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని
చెప్పారు. నవంబరు 18వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ
కార్యక్రమం జరుగుతుందన్నారు . మైదానంలో 1800 మంది కూర్చునేందుకు వీలుగా
ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీపోత్సవాన్నికి విచ్చేసే మహిళలకు తులసి
మొక్కలు అందివ్వాలన్నారు. అదేవిధంగా అష్టలక్ష్మీ వైభవం నృత్య రూపకం ,
సామూహిక లక్ష్మీనీరాజనం(దీపాలు వెలిగించడం)తో పాటు నక్షత్ర హారతి,
మంగళహారతి నిర్వహించనున్నట్లు తెలిపారు.
పిఆర్వో తగినంత మంది శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలన్నారు. ఇంజినీర్ విభాగం
స్టేజీ, బారికేడ్లు, ఇతర ఇంజనీర్ పనులను ముందుస్తుగా పూర్తి చేయాలని ఆమె
సూచించారు. కార్తీక మాసం విశిష్టతను తెలియజేసేలా స్టేజీపై సుందరంగా
పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు, మైదానంలో ఎల్ఇడిలు స్క్రీన్లు
ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు
చేయాలని ఆదేశించారు. అనంతరం జెఈవో అధికారులతో కలిసి టీటీడీ పరిపాలనా భవనం
మైదానంలో దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తిరుమల
శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ
కుమార్, ఎస్ఇ – 2 జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఈ (ఎలక్టికల్) వెంకటేశ్వర్లు,
ట్రాన్స్పోర్టు జిఎం శేషారెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్
శ్రీనివాసులు, అన్నదానం డెప్యుటీ ఈవో సుబ్రహ్మణ్యం, అన్నమాచార్య ప్రాజెక్టు
డైరెక్టర్ డా.విభీషణ శర్మ, విజివో మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్
సునీల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.