ప్రతి డివిజన్ స్థాయిలో 5 ఎకో టూరిజం ప్రాజెక్ట్ ప్రతిపాదనలు
త్వరలోనే డిఎఫ్ఓ లతో రాష్ట్రస్థాయి వర్క్ షాప్
రాష్ట్రంలోని ‘జూ’లకు కొత్త జంతువులు
సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతులు తీసుకోండి
ఎన్ఓసి జారీపై నిర్ధిష్ట మార్గదర్శకాల రూపకల్పన
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వెలగపూడి : రాష్ట్రంలో ప్రతి అటవీశాఖ డివిజన్ పరిధిలో కనీసం అయిదు ఎకో టూరిజం
ప్రాజెక్ట్ లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీశాఖ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో
అటవీశాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన
మాట్లాడుతూ ఎకో టూరిజం ద్వారా ప్రజలకు అహ్లాదాన్ని, పచ్చదనంతో కూడిన స్వచ్చమై
పరిసరాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కేంద్రప్రభుత్వ ఎకో టూరిజం గైడ్
లైన్స్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద ఎకో టూరిజం ప్రాజెక్ట్ లను
ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. ఇందుకు సంబంధించి త్వరలోనే
డిఎఫ్ఓల స్థాయిలో వర్క్ షాన్ ను నిర్వహించాలని ఆదేశించారు. ఎకో టూరిజం
ప్రాజెక్ట్ లలో పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.
రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి జూలలో ప్రజలను ఆకర్షించే కొత్త జంతువులను
తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ అధికారులతో చర్చించి
అవసరమైన అనుమతులు తీసుకోవాలని కోరారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్
వరకు ట్రామ్ లేదా రోప్ వే ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని
ఆదేశించారు. అటవీశాఖ నుంచి జారీ చేసే ఎన్ ఓ సిల విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్
ప్రొసిడింగ్స్ ను రూపొందించాలని కోరారు. ఇష్టారాజ్యంగా డిఎఫ్ఓల పరిధిలో
ఎన్ఓసిల జారీ వల్ల కొన్ని సందర్భాల్లో అటవీభూములపై హక్కులను కోల్పోతున్నామని
అన్నారు. కొన్ని డివిజన్ లలో అటవీభూములకు సంబంధించి ఎన్ఓసిల జారీ రికార్డులు
కూడా సక్రమంగా ఉండటం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2522 ఫారెస్ట్
బ్లాక్ ల్లో సుమారు 37 లక్షల హెక్టార్ల అటవీభూములు ఉన్నాయని, వాటిని
పరిరక్షించుకోవడం మన బాధ్యత అన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల
వల్ల జననష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏనుగులు పొలాలు,
గ్రామాల్లోకి వచ్చి నష్టం చేకూరుస్తున్నాయని, అటవీ సరిహద్దుల్లో ట్రెంచ్ లను
ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లు
ఉన్నాయి. మొదటి ఫేజ్ లో 15.6 లక్షల ఇళ్ళు నిర్మిస్తున్నారు. వీటిల్లో
ప్లాంటేషన్ చేపట్టాలి. ఇందుకోసం అటవీశాఖ నర్సరీల నుంచి మొక్కలను సమకూర్చాల్సి
ఉంటుంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో స్పెషల్
చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి,
పిసిసిఎఫ్ ఎకె ఝా, స్పెషల్ సెక్రటరీ పి.వి. చలపతిరావు, పిసిసిఎఫ్ బికె సింగ్,
పిసిపిఎఫ్ ఎకె నాయక్, అడిషనల్ పిసిసిఎఫ్ శాంతిపాండె తదితరులు
పాల్గొన్నారు.
అటవీశాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ
అధికారులు, సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయడం ద్వారా అటవీశాఖకు, ఈ
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం అటవీశాఖ
ఉద్యోగసంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అటవీశాఖలోని వివిధ ఉద్యోగ
కేడర్ లకు సంబంధించిన యూనియన్ ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలను మంత్రికి
వివరించారు. పదోన్నతులు, బదిలీలు, పునర్ వ్యవస్థీకరణ, ఖాళీ పోస్ట్ ల భర్తీ,
ఇతర సదుపాయాలకు సంబంధించి యూనియన్ నేతలు తమ సమస్యలను, డిమాండ్ లను వివరించారు.
అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ మంత్రిగా
గతంలో పనిచేసిన సందర్భంగా ఈ శాఖపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. అధికారులు,
సిబ్బంది సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో
సీఎం వైయస్ జగన్ పాలన వినూత్నంగా సాగుతోందని, ప్రగతిశీల నిర్ణయాలతో
రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. అదే పరిస్థితి అటవీశాఖలో
కూడా తీసుకువస్తామని, సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రోత్సాహకర
వాతావరణంను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు
ఉద్యోగులు చక్కగా పనిచేస్తే, మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ ప్రభుత్వం
అత్యంత పారదర్శక పాలనను అందిస్తోందని, న్యాయమైన డిమాండ్ ల విషయంలో ప్రభుత్వం
తప్పకుండా స్పందిస్తుందని అన్నారు. ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి అటవీశాఖను
అన్ని విధాలుగా ముందంజలో నిలపాలని కోరారు.