గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్
ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ఆషామాషీ వ్యవహారం కాదని, లక్ష
కోట్లతో ప్రభుత్వం చేస్తోన్న మహా యజ్ఞమని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్
పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న21 లక్షల ఇళ్ల కోసం నిర్మాణ
వ్యయం రూ.40,000 కోట్లు, భూసేకరణ వ్యయం రూ.25,000 కోట్లు, జగనన్న కాలనీల్లో
మౌలిక వసతుల కల్పన వ్యయం 34,000 కోట్లు.. వెరసి దాదాపు లక్ష కోట్ల వ్యయంతో
నిర్విరామంగా మహా యజ్ఞం జరుగుతోందన్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ఆలమూరు లే అవుట్ ను సందర్శించిన అనంతరం
స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి
రమేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ
మంత్రి ఉషశ్రీ చరణ్, రాష్ట్ర హౌసింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, జిల్లా
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా
పూర్తి చేయాలంటే అధికారుల సహకారం అవసరమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ
ఎన్నికలూ లేని సమయంలో ప్రభుత్వం గడప గడపకూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు
పరిష్కరించే కార్యక్రమం చేపట్టిందని, అధికారులు సైతం ప్రభుత్వ అడుగుజాడల్లో
నడిచి ప్రజల వద్దకు వెళ్లాలన్నారు.
జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ-వార్డు స్థాయిలో వాలంటీరు వరకూ ప్రతి ఒక్కరూ
వాళ్ల స్థాయిలో క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో
సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా కోటి 30 లక్షల
ఇళ్లు మంజూరైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి కారణంగా ఒక్క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 21 లక్షల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. అదే కృషి,
నిబద్ధత అధికారులు సైతం చూపించాలన్నారు.
మొదటి అడుగు తోపుదుర్తిదే..
ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలనుకుని కాంట్రాక్టర్ల వద్దకు వెళితే గిట్టుబాటు
కాదని ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉందేదని మంత్రి తెలిపారు. అలాంటి
సమయంలో రూ.2,15,000 ల ఖర్చుతో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తోపుదుర్తి ప్రకాశ్
రెడ్డి నిర్వహిస్తున్న సంస్థ ముందుకు రావడంతో మరో 350 సంస్థలు ఈ మహాయజ్ఞంలో
భాగస్వామ్యం కోసం ముందుకొచ్చాయన్నారు.
శాఖల మధ్య సమన్వయం అవసరం: హౌసింగ్ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్
2023 డిసెంబరు నాటికి 21 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు హౌసింగ్, గ్రామీణ నీటి
సరఫరా, విద్యుత్ శాఖ, ప్రజా వైద్యం, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో
పని చేయాలని హౌసింగ్ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ సూచించారు. గ్రామ,వార్డు
సచివాలయాల్లో పని చేస్తున్న కొందరు ఇంజినీర్లు ఇళ్ల నిర్మాణాల అంశం తమ
పరిధిలోనిది కాదన్నట్టు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు
తీసుకుంటామని హెచ్చరించారు.
గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ ఇళ్లు
పొందిన వారి స్థానాల్లో తిరిగి ఇతరులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇళ్లు
కోల్పోయిన వారికి గతంలో లబ్ధిదారులుగా ఉన్నట్టు ఆన్ లైన్ రికార్డులు
చెబుతున్నందున ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితి
వచ్చిందని, అలాంటి 4,000కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కామార పల్లిలో ఇచ్చిన
పట్టాల్లో భౌగోళిక కారణాల వల్ల ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉందాని,
కొడిమి, ఉప్పర పల్లి గ్రామాల్లో కోర్టు కేసుల వల్ల ఇళ్ల నిర్మాణాలు జరగడం
లేదని, ఇటువంటి చోట ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చే అవకాశం
పరిశీలించాలని సూచించారు. మొదటి ఫేజ్ లో ఓటీఎస్ కట్టనివారు ఇప్పుడు కడతామని
ముందుకు వస్తున్నారని, వారి కోసం తిరిగి ఓటీఎస్ సెకండ్ ఫేజ్
నిర్వహించాలన్నారు.
ఎమ్మెల్సీ శివరామి రెడ్డి మాట్లాడుతూ లే అవుట్ లలో నిర్మాణ వ్యయం తగ్గించి
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ఇసుక డిపోలు కాలనీలకు దగ్గరగా ఉండేలా
చూడాలన్నారు. నియోజక వర్గం వారీగా కాకుండా ఎక్కువ ఇళ్లు మంజూరైన ప్రాంతాలకు
డంప్ యార్డ్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బిల్లుల కోసం లబ్ధిదారులను
కార్యాలయాల చుట్టూ తిప్పుకునే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్సెల్సీ శివరామి రెడ్డి, ఎమ్మెల్యేలు
తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి,
వై.వెంకట్రామి రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్ పర్సన్ లిఖిత, ఆహుడా చైర్ పర్సన్
మహాలక్ష్మి శ్రీనివాస్,అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, మేయర్ వసీం,
డిప్యూటీ మేయర్లు కోగటం విజయ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహితీ తదితరులు
పాల్గొన్నారు.