9 గంటల విద్యుత్ సరఫరాలో అలసత్వం సహించం
ట్రాన్స్ కో, డిస్కంలు సమన్వయంతో పనిచేయాలి
ఆక్వాజోన్ లో ఇస్తున్న సబ్సిడీపై పూర్తి వివరాలు సమర్పించాలి
సచివాలయాల్లో విద్యుత్ సమస్యలపై 1912 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రదర్శించాలి
ఎనర్జీ అసిస్టెంట్ సేవలను వినియోగించుకోవాలి
గడప గడపకు ప్రభుత్వం లో విద్యుత్ అధికారులు పాల్గొనాలి
ప్రజల నుంచి వచ్చే సమస్యలను రికార్డు చేసి వాటి పరిష్కారంకు చర్యలు
విద్యుత్ ప్రమాదాల నివారణకు పోల్ టు పోల్ తనిఖీలు
భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
మూడు నెలల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి కావాలి
మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులుతో మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్
విజయవాడ : వ్యవసాయంకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం
చేసుకున్న దరఖాస్తులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని రాష్ట్ర ఇంధన, అటవీ,
పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విద్యుత్
శాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వ్యవసాయానికి తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందించాలన్న సీఎం శ్రీ
వైయస్ జగన్ గారి ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు పనిచేయాలి.
ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించేంది లేదు. వ్యవసాయ కనెక్షన్ కోసం చేసుకున్న
దరఖాస్తులను రోజుల తరబడి పెండింగ్ లో పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరుతాం. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి
వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంటాం. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం.
ఎక్కడైనా రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదు వచ్చినా దానిపై
కఠినంగా చర్యలు తీసుకుంటాం. రానున్న వేసవిలో డిమాండ్ కు తగిన విధంగా విద్యుత్
సరఫరా జరగాలి.
అందుకోసం ట్రాన్స్ కో తో డిస్కంలు సమన్వయం చేసుకోవాలి. ముందస్తు ప్రణాళికతో
ఇబ్బందులను పరిష్కరించుకోవాలి. ఇంధన శాఖ ప్రతిష్టను పెంచేలా అందరూ పనిచేయాలి.
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆక్వాజోన్ పరిధిలోని
అర్హులైన రైతులకు సబ్సిడీపై విద్యుత్ ను అందిస్తోంది. దీనిపై సర్కిళ్ళ వారీగా
ఎంత విద్యుత్ ను సబ్సిడీపై అందిస్తున్నాము, జోన్ పరిధిలో ఎంత డిమాండ్ ఉంది అనే
అంశాలపై వివరాలను తీసుకుని సమర్పించాలి. ఇంకా మెరుగైన విద్యుత్ ను
అందించేందుకు అవసరమైన ప్రణాళికను దీనిద్వారా సిద్దం చేసుకోవాలి.
వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం రైతుల
నుంచి ఆధార్ అప్ డేషన్, బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసే ప్రక్రియను వేగవంతం
చేయాలి. ఇంకా డిస్కంల పరిధిలో కొన్ని జిల్లాల నుంచి దీనిపై అలసత్వం
కనిపిస్తోంది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోండి. రాష్ట్రంలో అవసరమైన
ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కెవి స్టేషన్ల నిర్మాణం మూడు నెలల్లో
పూర్తి చేయాలి. కొన్నిచోట్ల పనులు ఆలస్యంగా జరగుతున్నాయి. వీటిపై
దృష్టిసారించాలి.
అలాగే ఇండోర్ సబ్ స్టేషన్ ల వల్ల ఎక్కువ వ్యయం అవుతోంది. అర్భన్ ప్రాంతాల్లో
తప్పనిసరి అయితే మాత్రమే వాటిని ప్రతిపాదించాలి. రూరల్ ప్రాంతాల్లో ఇండోర్
స్టేషన్ల ను నిర్మించడానికి వీలులేదు. గడప గపడకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
క్షేత్రస్థాయిలోని విద్యుత్ అధికారులు పాల్గొనాలి. స్థానికంగా పరిష్కరించే
సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించండి. ప్రతి సమస్యను
రికార్డు చేయాలి. వాటిపై తీసుకున్న చర్యలను కూడా వివరించాలి. ఈ కార్యక్రమంలో
చేయాల్సిన పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. సబ్ స్టేషన్లు, లైన్ల
నిర్మాణంలో ఎక్కడైనా అటవీ, రెవెన్యూ విభాగాల నుంచి అనుమతులు రాకపోతే వాటిని
పరిష్కరించుకునేందుకు డిస్కంల స్థాయిలో నోడల్ అధికారును నియమించుకోవాలి. మీ
స్థాయిలో పరిష్కారం కాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అవసరమైన అనుమతులు
తీసుకుంటాం. వీడియో కాన్ఫెరెన్స్ లో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
విజయానంద్, ట్రాన్స్ కో సిఎండి బి.శ్రీధర్, విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి,
ట్రాన్స్ కో డైరెక్టర్ భాస్కర్, డిస్కం సిఎండిలు పద్మాజనార్థన్ రెడ్డి, సంతోష్
రావు, పలు జిల్లాల నుంచి విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.