నాణ్యతా ప్రమాణాల నిర్దారణకు బిఇడి కాలేజీల్లో తనిఖీలు
త్వరలోనే బిఇడి కోర్సుల ప్రవేశాలు
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
వివిధ డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల పై ఉన్నతాధికారులతో సమీక్ష
విజయవాడ : రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో గతంలో
ఎన్నడూ లేనట్లు రికార్డు స్థాయిలో విద్యార్ధుల అడ్మిషన్లు జరిగాయని విద్యా శాఖ
మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం
ఉత్తీర్ణులైన 3,37,987 మంది విద్యార్ధుల్లో దాదాపు 3,15,600 మంది విద్యార్ధులు
వివిధ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రవేశం పొందారని ఆయన
పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియపై ఉన్నత విద్యా శాఖ ముఖ్య
కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.హేమచంద్రా రెడ్డి
లతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు సమీక్ష జరిపారు. గతంలో
కంటే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం
లేదన్నారు. ప్రస్తుత విద్యా సంత్సరంలో ఉత్తీర్ణులైన 3,37,987 మంది
విద్యార్ధుల్లో దాదాపు 3,15,600 మంది (93.38 శాతం) విద్యార్ధులు వివిధ
కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రవేశం పొందారని ఆయన పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారిలో కేవలం 22 వేల పైచిలుకు
విద్యార్దులు మాత్రమే ఉన్నత చదువుల్లో ప్రవేశం పొందలేదన్నారు.
కోవిడ్ కు ముందు 2018-19 లో 4,07,704 మంది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు కాగా
వారిలో కేవలం 3,19,891, మంది మాత్రమే తదుపరి ఉన్నత విద్యలో అడ్మిషన్లు
పొందారని (79.63 శాతం) 2019-20 లో 3,97,494 మంది విద్యార్ధులకు గాను 3,50,540
మంది (88.19 శాతం) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందారన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన
నేపథ్యంలో ఈ ఏడాదిలో ఇంతవరకు ఇంజనీరింగ్ కోర్సుల్లో 1.20 లక్షల మంది, ఫార్మసీ
లో 12 వేల మంది, వ్యవసాయం- ఆక్వా కల్చర్ లో 5 వేల మంది తోపాటు, మెడికల్ మరియు
నర్సింగ్ కోర్సుల్లో 15 వేల మంది అడ్మిషన్లు పొందారని ఈ సందర్భంగా అధికారులు
మంత్రికి వివరించారు. అలాగే వివిధ డిగ్రీ కోర్సుల్లో 1.48 లక్షల మంది , ఐఐఐటి,
ఎన్ఐటి, వంటి కోర్సుల్లో 5600 మంది, ఇతర రాష్ట్రాల్లో మరో 10 వేల మంది
ప్రవేశాలు పొందారన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారిలో అత్యధిక శాతం పై
చదువులకు ప్రవేశాలు పొందడం మంచి పరిణామమని మంత్రి పేర్కొన్నారు.
బిఇడి కళాశాలల్లో ప్రమాణాలకే పెద్ద పీట…. తనిఖీల అనంతరమే ప్రవేశాలు
రాష్ట్రంలోని విద్యార్ధులకు నాణ్యతో కూడిన విద్యా బోధన అందేలా చూడాలన్న
క్రమంలో, బిఇడి కళాశాలల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చర్యలు
తీసుకోవాలని యూనివర్శిటీల విసిలకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లతో నిర్వహించిన సమావేశంలో (వర్చువల్ విధానంలో) ఎన్
సీ టి యీ ప్రమాణాలను అమలు చేస్తున్నారా లేదా అన్న అంశం పరిశీలించిన తరువాతనే
బిఇడి కళాశాలల గుర్తింపు రెన్యువల్ చేయాలని ఆదేశించారు. బిఇడి కళాశాలల్లోని
ప్రమాణాలపై పలు ఫిర్యాదులు వస్తున్న దరిమిలా, విద్యార్ధుల భవిష్యత్తును
దృష్టిలో ఉంచుకుని నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని మంత్రి అన్నారు.
వీలైనంత త్వరలో ఈ తనిఖీలను పూర్తి చేసి, బిఇడి కోర్సుల ప్రవేశాలను పూర్తి
చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.