చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ ఎందుకు అడగలేదు?
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
గుంటూరు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తుంటే జగనన్న
ఇళ్లు..పవన్, చంద్రబాబు కన్నీళ్లు లాగా ఉందని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా
చేశారు. ఆయన పర్యటనలకు ఈ ట్యాగ్ లైన్ పెట్టుకోవడం బెటర్ అని సూచించారు.
విజయనగరం పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ అసలు ఏం చేసినట్లు అని ప్రశ్నించారు.
పవన్ మాటలు, చేష్టలు వింతగా ఉన్నాయన్నారు. వీకెండ్లో గెస్ట్ ఆర్టిస్ట్‌గా
వచ్చి ప్రభుత్వాన్ని తిట్టి వెళ్లాడు. 21 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా
జరుగుతుంటే చూడలేక పవన్‌కు కడుపుమంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంకలాంలో
కూడా 12 వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే ఏమీ జరగనట్టు చెప్తున్నాడు. కళ్లుంటే,
సరిగా చూస్తే ఆ ఇళ్ల నిర్మాణం కనిపిస్తుంది అని మండిపడ్డారు. 2014లో టీడీపీ,
జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మరి ఒక్క
ఇళ్లయినా ఎందుకు కట్టించలేదు? సెంటు స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు? మరి ఆరోజు
చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ ఎందుకు అడగలేదు? అని వరుస ప్రశ్నలు
సంధించారు.
పిల్ల సైకోలను పోగేసుకుని వచ్చి గుంకలాంలో మీటింగ్ పెట్టారు. లబ్ధిదారులు
తిరగబడితే ఈ పిల్ల సైకోలు పరుగెత్తుతున్నారు. జనాల్ని రెచ్చగొట్టి హైదరాబాద్
పారిపోవటం తప్ప ఇక ఏం చేస్తున్నావ్?. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల
నిర్మాణం ఏ రాష్ట్రంలోనూ జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వమే శభాష్ అని
మెచ్చుకున్నదని తెలుసుకో. మనసున్న ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. గడపగడపకూ
ప్రభుత్వం కార్యక్రమానికి వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారో,
మెచ్చుకుంటున్నారో తెలుస్తుంది. పవన్, ఆయన దత్తతండ్రి కలిసొచ్చినా ఈ
ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. రాక్షసులు, దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు
సృష్టించినా పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం. అసలు ఎన్నికల్లో చంద్రబాబు
ఎన్ని సీట్లు ఇస్తారో చూసుకో. నువ్వు ఎక్కడెక్కడ పోటీ చేయాలో అది చూసుకో.
గెలుస్తావో లేదో అది కూడా చూసుకో పవన్ అని సూచించారు.
చంద్రబాబుకే ఎక్కడ పోటీ చేయాలో అర్థం కావడం లేదు. ఇక దత్తపుత్రుడు, సొంత
పుత్రుడుకి ఎక్కడ సీట్లు ఇస్తాడో చూడాలి. లోకేష్ మోకాళ్లతో నడిచినా మీరు చేసిన
పాపాలు పోవు. మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారు. 2024లో చంద్రబాబు, లోకేష్,
పవన్ ఎవరూ అసెంబ్లీలో అడుగు పెట్టలేరు. అసలు లోకేష్ పాదయాత్ర ఎందుకు
చేస్తున్నట్టు?. ఏనాడైనా ప్రజల ఓట్లతో గెలుపొందారా?. తండ్రి పడేసిన పదవులతో
రాజకీయం చేసిన వ్యక్తి లోకేష్. అన్నివర్గాల ప్రజలకు సీఎం జగన్ న్యాయం
చేస్తున్నారు. ఇక ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తావ్ లోకేష్? అంటూ మంత్రి
జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.