రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు అన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ షణ్ముఖ వేద
విద్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు
కప్పగంతు జానకిరామావధాని తమ శిష్య బృందంతో కలిసి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం
పలికి, వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రాచీన
భారతీయ విజ్ఞానం వేదాలలో నిక్షిప్తమై ఉందని తెలిపారు. వేల సంవత్సరాలుగా వేదాలు
మౌఖికంగా లోకానికి జ్ఞానాన్ని పంచుతున్నాయన్నారు. ఆధునిక పరిశోధకుల ఊహలకు సైతం
అంతుచిక్కని విద్య, వైజ్ఞానిక, సామాజిక, ఆర్థిక విషయాలెన్నో వేదాల్లో ఉన్నాయని
పేర్కొన్నారు.
వేదాల గొప్పదనాన్ని విదేశీయులు సైతం కీర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు.
అటువంటి అమూల్య గ్రంథాలు మనకు వారసత్వ సంపదగా లభించడం మన అదృష్టమని.. వాటిని
పరిరక్షించి, వేద విద్య వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కృషి
చేస్తున్నట్లు వెల్లడించారు. వేద విద్యా పరిరక్షణతో సనాతన ధర్మాన్ని
కాపాడుకున్నట్లు అవుతుందని చెప్పారు. వేదాల్లోని విజ్ఞానం సామాన్య ప్రజలకు
సైతం అందేలా పండితులు, వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కృషి చేయాలని
కోరారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు మల్లాది విష్ణుని దుశ్శాలువాతో ఘనంగా
సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు మేడిచర్ల నారాయణ
శాస్త్రి, జాగర్లపూడి కౌండిన్య శర్మ, వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.