రాయలసీమ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలి
అవసరమైతే ఎన్నికలను బహిష్కరించడానికీ ప్రజలు సిద్ధం కావాలి
అభివృద్ధి వికేంద్రీకరణ సాధన జేఏసీ పిలుపు
శ్రీభాగ్ ఒడంబడిక చేసుకున్న రోజును పురస్కరించుకుని వెనుకబడిన రాయలసీమ ప్రాంత
అభివృద్ధి కోసం శ్రీ భాగ్ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ
అనంతపురం నగరంలోని శ్రీ కల్లూరు సుబ్బారావు లలిత కళాపరిషత్ ప్రాంగణంలో ఈ నెల
16 న బుధవారం ఉదయం 10 గంటలకు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు అభివృద్ధి
వికేంద్రీకరణ సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (నాన్ పొలిటికల్) పిలుపునిచ్చింది.
అనంతపురం నగరంలోని లలిత కళ పరిషత్ లో జేఏసీ కన్వీనర్ ఆలూరు రామిరెడ్డి,
అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి (ఏవీఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణ
అధ్యక్షతన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1937 నవంబర్ 16న శ్రీ భాగ్ ఒడంబడిక
జరిగిందన్నారు. ఈ ఒప్పందం జరిగి ఇప్పటికీ 85 సంవత్సరాలు కావస్తున్నా అమలు
చేయకుండా పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ముఖ్యంగా జలవనరుల
విభజన, ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వంటి అనేక రంగాల్లో
రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి
విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అనంతరం, కర్నూల్ రాజధానిగా ఉన్న
రాయలసీమ ఆ రాజధానిని కూడా కోల్పోయి, హైదరాబాదు రాజధానిగా ఏర్పడిందన్నారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా రాయలసీమ ప్రాంత నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఈ
ప్రాంతాన్ని ప్రణాళిక బద్ధంగా, దూరాలోచనతో అభివృద్ధి చేసి ఆదుకున్న దాఖలాలు
లేవని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిని కూడా కోల్పోయి మరోసారి
సీమ దగాకు గురైందన్నారు. కేంద్రీకృత విధానాల వల్ల ఈ విధమైన నష్టాన్ని రాయలసీమ
అనుభవించాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన సందర్భంలో భవిష్యత్తులో రాయలసీమకు తీవ్ర
అన్యాయం జరుగుతుందని గుర్తించిన నాటి పెద్దలు శ్రీభాగ్ ఒడంబడిక ద్వారా ఈ
ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరారన్నారు. శ్రీ భాగ్ ఒడంబడిక కమిటీలో
అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు వంటి
వారు కూడా ఉన్నారన్నారు. వారు ఆశించిన మేరకు వారి ఆశయాలకు అనుగుణంగా శ్రీ భాగ్
ఒప్పందం అమలు జరగడం లేదన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని మూడు
ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ
అభివృద్ధికి, భవిష్యత్ తరాల బాగు కోసం పాలకులు కృషి చేయాలని, ఇప్పటివరకు తీవ్ర
వెనుక బాటుతనాన్ని అనుభవించిన రాయలసీమ అభివృద్ధి కోసం ప్రజల్లో చైతన్యం
తీసుకురావడానికి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించేందుకు చర్యలు
తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ప్రజా
ప్రతినిధుల సహకారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు ప్రతినిధులను
తీసుకువెళ్లాలని నిర్ణయించామన్నారు. రాయలసీమ అభివృద్ధికి సహకరించాలని, అన్ని
పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని, ఈ మేరకు కలిసి రాని ప్రతి ఒక్కరూ
రాయలసీమ ద్రోహులు గానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ పుట్టి, ఇక్కడ
పెరిగి, ఇక్కడి ఓటర్ల ద్వారా పదవులు పొంది, ఈ ప్రాంతాన్ని విస్మరించడం అత్యంత
హేయమన్నారు. తీవ్ర క్షామపీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లా ప్రజలు ఈ రాష్ట్రంలో
భాగమేనని, తామేమి సవతి తల్లి బిడ్డలం కాదన్నారు.
రాయలసీమ అభివృద్ధికి ఆటంకం కలిగించే రాజకీయ పార్టీలను ఎన్నికల్లో
బహిష్కరించాలని, అందుకు ప్రజలు సన్నద్ధం కావాలని జేఏసీ తరఫున పిలుపునిచ్చారు.
రాష్ట్రం హైదరాబాద్ ను కోల్పోయి, ఎనిమిది సంవత్సరాలు గడిచిపోతున్నా రాయలసీమను
ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో సీమవాసులు ఏకతాటిపైకి
రాకుంటే భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయని, విద్య, వైద్యం ఉద్యోగ, ఉపాధి
కోసం వలసలు వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం
చేశారు. ప్రజలు రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ఈ ఉద్యమాన్ని ఇంటింటా ప్రజా
ఉద్యమంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై త్వరలో చైతన్య సభలు
నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఆలూరు రామిరెడ్డి, కె.వి రమణ
తెలిపారు. విద్యార్థులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రకాల
ప్రజాసంఘాలు, రైతు సంఘాలతో కలిపి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి మీడియా కూడా తోడ్పాటును అందించి సహకరించాలని విజ్ఞప్తి
చేశారు. ఈ నెల 16వ తేదీ చేపడుతున్న సత్యాగ్రహ దీక్ష కార్యక్రమానికి
పార్టీలకతీతంగా ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
అభివృద్ధి వికేంద్రీకరణ సాధన జేఏసీ కో కన్వీనర్ సీ. హనుమన్న, కోర్ కమిటీ
సభ్యులు లలితకళ పరిషత్ చైర్మన్ గాజుల వెంకటసుబ్బయ్య తదితరులు మాట్లాడారు.
విలేకరుల సమావేశంలో జేఏసీ కోర్ కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్టు కేపీ.కుమార్,
యువ సాహితీవేత్త అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి, ఎంపీడీవో నాగరాజు, రైతు సంఘం
నాయకులు శ్రీనివాసులు రెడ్డి, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు
రామాంజనేయులు, కుల్లాయిస్వామి, రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.