పర్యావరణ విధ్వంసంపై ఆవేదన
కాపులుప్పాడ బీచ్ లో మత్స్యకారుల సమస్యలపై జాలరితో ముచ్చటించిన పవన్
కళ్యాణ్
విశాఖపట్నం : రుషికొండను మింగేస్తున్న ప్రభుత్వ విధ్వంసకాండను జనసేన పార్టీ
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం స్వయంగా వీక్షించారు. రుషికొండ
చుట్టూ అక్రమ తవ్వకాలు కనబడకుండా ప్రభుత్వం కొండ చుట్టూ బ్లూ షీట్స్ ఏర్పాటు
చేయగా రహదారి పక్కన ఉన్న ఓ ఎత్తయిన గుట్టపైకి ఎక్కి లోపల జరుగుతున్న పనులు
పరిశీలించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం నిమిత్తం విశాఖ వచ్చిన
పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి
రుషికొండ పరిసరాల్లో పర్యటించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం చేస్తున్న
పర్యావరణ విధ్వంసంపై అధ్యయనం చేశారు. కొండ చుట్టూ పోలీసులను కూడా మోహరించి
అడ్డగోలుగా చేస్తున్న పనులను గమనించారు. న్యాయస్థానాల తీర్పులను సైతం
ఉల్లంఘించి రుషికొండకు ఏ విధంగా గుండు కొట్టేస్తున్నారు? అక్రమ కట్టడాల
తీరునుపవన్ కళ్యాణ్ కి జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
వివరించారు.
బీచ్ లో ఈవినింగ్ వాక్ :
అంతకు ముందు కాపులుప్పాడ సముద్ర తీరానికి వ్యాహాళి నిమిత్తం వెళ్లారు. బీచ్
లో అలలను, అక్కడ పరిసరాలను కాసేపు ఆస్వాదించారు. బీచ్ ఒడ్డున కాసేపు వాకింగ్
చేశారు.
మత్స్యకారుల అభ్యున్నతికి మేము ఏం చేయాలి? :
బీచ్ లో నడుస్తున్న సమయంలో అక్కడ చేపలు పట్టుకుంటున్న చేపల తిమ్మాపురం
గ్రామానికి చెందిన జగన్నాథం అనే మత్స్యకారుడిని పవన్ కళ్యాణ్ పలుకరించారు.
వేట మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇరువురు మధ్య పది నిమిషాల పాటు సాగిన ఆసక్తికర చర్చలో జనసేన పార్టీ
ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అమలు చేస్తే మత్స్యకారులకు మంచి జరుగుతుంది అని
జగన్నాథంను పవన్ కళ్యాణ్ అడిగారు. ప్రభుత్వం నుంచి డీజిల్ రాయితీ ఎలా
అందుతోంది ? వేటకు వెళ్లే మత్స్యకారులు ఎదుర్కొనే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి
అనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జగన్నాథం సంప్రదాయ మత్స్యకారులు
ఎదుర్కొంటున్న ఇబ్బందులు పవన్ కళ్యాణ్ కి వివరించారు.
డీజిల్ రాయితీ మత్స్యకారులందరికీ అందడం లేదు. రాయితీ పొందే వారికి కూడా బంకులు
దూరంగా ఉండడం వల్ల వాటిని పొందలేకపోతున్నారు. ఇతర తీర ప్రాంతాలకు వలస వెళ్లిన
సమయంలో సముద్ర జలాల్లో సరిహద్దులు దాటి వెళ్లిన సమయంలో పొరుగు దేశాల నుంచి
ఇబ్బందులు వస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తుపానులు వచ్చినప్పుడు తీర
ప్రాంతానికి ఆనుకుని ఉండే మత్స్యకార గ్రామాల్లో అలల తాకిడికి పక్కా గృహాలు
సైతం ధ్వంసమవుతున్నాయి. మత్స్యకారులు అభివృద్ధి చెందాలి అంటే విద్య, వైద్యం
లాంటి సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో పక్కా
గృహాలు నిర్మించాలి. విడతల వారీగా అయినా ఇలాంటి కనీస వసతులు కల్పించగలిగితే
మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని పవన్ కళ్యాణ్ కి చెప్పారు. వేట సమయాల్లో
వచ్చే ఇబ్బందులు, విశాఖ తీర ప్రాంతంలో లభించే చేపల విషయాలపైనా ఆరా తీసిన పవన్
కళ్యాణ్ జనసేన పార్టీ మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ
ఇచ్చారు.
విశాఖ సాగర తీరంలో జనసేనాని : రాజకీయాలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే జనసేన
అధినేత పవన్ కల్యాణ్ విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు. పార్టీ నేతలతో
కలిసి కాపులప్పాడ బీచ్‌ను సందర్శించిన ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడి
వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విశాఖ రుషికొండ ప్రాంతాన్ని
పరిశీలించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విశాఖ కార్పొరేటర్
పీతల మూర్తియాదవ్ తదితరులు పవన్ వెంట ఉన్నారు. రెండ్రోజుల విశాఖ పర్యటనలో
భాగంగా నిన్న సాయంత్రం విశాఖ చేరుకున్న పవన్ శుక్రవారం రాత్రి ప్రధాని మోదీతో
భేటీ అయిన విషయం తెలిసిందే.