పెడనలో జనసేన నేతలకు చుక్కెదురు
రాష్ట్రంలో ఇళ్ల పనుల పరిశీలన కోసం జనసేన పార్టీ ప్రారంభించిన సోషల్ ఆడిట్ లో
తొలిరోజే నేతలకు చుక్కెదురైంది. కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన
నాయకులు పరిశీలన కోసమంటూ రాగా స్థానికులు వారిపై తిరగబడి తిప్పి పంపారు.
జగనన్న లే ఔట్‌ను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని
చెప్పాలంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు దిగిన
జనసేన నాయకులపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచి పని చేస్తుంటే బురద జల్లడం ఏమిటని ప్రశ్నించారు. పేదవారిని ఆదుకోవడం
జగనన్న చేసిన తప్పా అని నిలదీశారు. కట్టుకుంటున్న ఇంటిని వదిలేసి తప్పుడు
ప్రచారం కోసం గుంతలు, చెరువుల, ఫొటోలు తీసి రాజకీయ లబ్ది పొందాలని
చూస్తున్నారంటూ వారిని తరిమి కొట్టారు. సొంత ఇల్లు లేని తమకు జగనన్న కాలనీలో
ఇళ్లు ఇచ్చారని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని
హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక జనసేన నాయకులు తోకముడిచి అక్కడినుంచి
జారుకున్నారు.