అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
సచివాలయ ఉద్యోగులు వచ్చామా.. వెళ్లామా అన్నట్లు ఉండొద్దని అనంతపురం ఎమ్మెల్యే
అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగులు ఫీల్డ్‌లో
ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లో విధులు
నిర్వహిస్తున్న వారంతా మనసు పెట్టి బాధ్యతగా పని చేయాలని సూచించారు. శనివారం
నగరంలోని 9, 10 డివిజన్లలో కార్పొరేటర్లు వై.లక్ష్మిదేవి, ఎం.దేవిలతో కలిసి
గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ
పథకాలతో మూడేళ్లుగా కలిగిన లబ్ధిని ప్రతి ఇంటికి వివరించారు. స్థానికంగా
నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
స్థానికంగా ఉన్న సీపీఐ నాయకులు ఎమ్మెల్యే అనంత దృష్టికి పలు సమస్యలను
తీసుకెళ్లారు. ప్రధానంగా తాగునీరు, డ్రెయినేజీ, పైప్‌లైన్ సమస్యలను
విన్నవించగా వాటిని పరిష్కరించే బాధ్యత తనదని సీపీఐ నాయకులకు ఎమ్మెల్యే అనంత
స్పష్టం చేశారు.
ఇప్పటికే పనులు జరుగుతున్నాయని, మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు.
డ్రెయినేజీ సమస్యలకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
వేస్తున్నామన్నారు. సచివాలయం పరిధిలో ఎంత మేరకు రోడ్లు ఉన్నాయి? డ్రెయినేజీల
పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ మరమ్మతు చేయాలి? ఎక్కడ కొత్తవి వేయాలి? అనే
సమాచారం లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా
వస్తున్న ప్రతి గ్రీవెన్స్‌ను పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేయాలని స్పష్టం
చేశారు. గత ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటో
స్పష్టంగా ప్రజలకు వివరించాలని తెలియజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్
వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్
యార్డు చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.