విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ
మోడీ తో భేటీ కోసం విశాఖ వెళ్లనున్న పవన్ కల్యాణ్
ఏపీలోని పరిస్థితులను వివరించనున్న జనసేనాని
అమరావతి : ఏపీ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్
కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ కానుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా
మారింది. ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు రానున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
రాష్ట్రంలోని విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ
క్రమంలో విశాఖ రానున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ
కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రత్యేక విమానంలో విశాఖ పర్యటనకు
బయలుదేరనున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక
విమానంలో బయలుదేరనున్న పవన్ నేరుగా విశాఖ చేరుకుంటారు. విశాఖ చేరిన తర్వాత
శుక్రవారమే పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని
తాజా రాజకీయాలు, రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆయన ప్రధానికి
వివరించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు విశాఖలోనే వుంటారు. అయితే
ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరు
కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోడీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు
పవన్ హాజరవుతారా? లేదా? అన్న వివరాలు తెలియరాలేదు. రాష్ట్రంలో పరిస్థితులు,
తాజా రాజకీయాలపై చర్చించే అవకాశముందని సమాచారం. విశాఖలో బీజేపీ నిర్వహించే
ర్యాలీలో పవన్ పాల్గొంటారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
శుక్రవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ విశాఖ
చేరుకుంటారు. రెండ్రోజుల పాటు ఆయన విశాఖలో పర్యటిస్తారని జనసేన వర్గాలు
తెలిపాయి. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా పవన్ను పోలీసులు అడ్డుకోవడం
ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.