గుంటూరు : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగుదేశం
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ నేతృత్వంలో నీరు చెట్టు,
నరేగా ఫిర్యాదుల విభాగం బాధ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
కింజారపు అచ్చంనాయుడు తో సమావేశమై ఫిర్యాదుల విభాగాల పురోగతిని వివరించారు. ఈ
సందర్భంగా దీనిపై ఆయన స్పందిస్తూ నీరు చెట్టు బిల్లులు అందక రైతులు ఆత్మహత్య
చేసుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. నీరు చెట్టు
నిధులు విడుదలకు జూన్ లో జీవోలు మాత్రమే ఇచ్చి రైతుల ఖాతాలకు ఇప్పటివరకు నగదు
జమ చేయకపోవడం చాలా దారుణం అన్నారు. నీరు చెట్టు బాధితులకు పూర్తిగా బిల్లు
అందే వరకు కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే అవసరమైతే
ధిక్కార పిటిషన్లు వేసి పనులు చేసిన రైతులకు అండగా ఉండాలని నీరు చెట్టు
ఫిర్యాదుల విభాగానికి సూచన చేశారు.
ఈ సందర్భంగా నీరు చెట్టు ఫిర్యాదుల విభాగం బాధ్యులు, సాగునీటి వినియోగదారుల
సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు మాట్లాడుతూ
నీరు చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లించాలని నేటి వరకు 6,210 మంది గౌరవ
హైకోర్టును ఆశ్రయించగా ఆరువారాలలో నగదు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినా అమలు
చేయకపోవడంతో సుమారు 2600 మంది బాధిత రైతులు దిక్కార పిటిషన్లు వేశారని
తెలిపారు. చివరగా రూ.200 కోట్లకు సంబంధించి జీవో మాత్రమే ఇచ్చి అందులో
పూర్తిగా నగదును ఇవ్వకుండా ఐదు నెలలుగా కాలయాపన చేయటం చాలా దారుణం అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సి ఎఫ్ ఎం ఎస్ లో టోకెన్ పడిన రూ. 1277 కోట్లకు బిల్లులకు
సంబంధించి ఈప్పటి వరకు రూ. 429 కోట్లు విడుదల చేసి కేవలం రూ.350 కోట్లు
మాత్రమే రైతుల ఖాతాలలో జమ చేశారని తెలిపారు. గతంలో నరేగా బిల్లులు చెల్లించిన
విధముగా హైకోర్టు ఆదేశాలు మేరకు నీరు చెట్టు పెండింగ్ బిల్లులు మొత్తం రైతుల
ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేగా ఫిర్యాదుల
విభాగం బాధ్యులు, రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ డైరెక్టర్ వీరంకి వెంకట
గురుమూర్తి మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నరేగా పథకం
నుంచి పెద్ద ఎత్తున గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సిమెంట్ రోడ్లు,
పంచాయతీ భవనాలు, అంగన్వాడి బిల్డింగులు, చెత్త నుండి సంపద మొదలైనటువంటి
గ్రామాభివృద్ధి పనులు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నరేగా నిధుల్ని ఇళ్ల
స్థలాలు మెరక పేరుతో వేలాది కోట్లు వైసీపీ మంత్రులు, నాయకులు దోపిడీ చేశారని
అన్నారు. ఇంకా నరేగా పెండింగ్ బిల్లులు నాణ్యతాపరమైన రికవరీ 21శాతం, 6శాతం
తగ్గించిన మొత్తం, కన్వర్జెన్సీ పనులు గురించి కానీ, ఎం బుక్ కానివి, యంబుకు
అయి ఎఫ్ టి వో లు కానీ పనులు తాలూకు రూ.788 కోట్లు బకాయిలు వెంటనే
చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర
నీరు చెట్టు పెండింగ్ బిల్లుల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు చెన్నుపాటి శ్రీధర్,
కౌలూరి రాజా చంద్రమౌళి,నరేగా ఫిర్యాదుల విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతుగంటి
పీరయ్య తదితరులు పాల్గొన్నారు.