ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యం
వీటి ద్వారా వాస్తవ రూపంలోకి
రూ.23,286 కోట్ల పెట్టుబడులు
పరిశ్రమలతో 20,974 మందికి ఉపాధి
విజయవాడ : ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గడంతో రాష్ట్ర
ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిపై దృష్టిసారించింది. వచ్చే రెండేళ్లలో కొత్త
పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాటిని వాస్తవరూపంలోకి తీసుకురావడం,
ప్రతిపాదిత యూనిట్లలో త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు
తీసుకుంటోంది. వచ్చే ఎనిమిది నెలల్లో రూ.50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న
27 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా
పెట్టుకుంది. ఏ నెలలో ఏ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమవుతుందన్న సమాచారాన్ని
సేకరించిన పరిశ్రమల శాఖ ఒక క్యాలెండర్ సిద్ధంచేసింది. దీని ఆధారంగా ప్రతీనెలా
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఇందులో భాగంగా వచ్చే ఎనిమిది నెలల్లో కనీసం 27 యూనిట్లు వాణిజ్యపరంగా
ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల రూ.23,286 కోట్ల
విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడమే కాకుండా 20,974 మందికి ఉపాధి
లభిస్తుంది. జపాన్‌కు చెందిన యోకోహామా గ్రూపునకు చెందిన ఏటసీ టైర్స్, ఆన్‌రాక్
అల్యూమినియం, రామ్‌కో సిమెంట్, టాటా కెమికల్స్, బ్లూస్టార్ఏసీ, శారదా మెటల్స్
విస్తరణ, ఓఎన్జీసీ వంటి యూనిట్ల నుంచి త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి
ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలను తీసుకుంటోంది. రాష్ట్రంలో
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల కాలంలో 28,343
యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ.47,490.28 కోట్ల విలువైన
పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి కల్పించారు.
ఇందులో
28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా, 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవికాక మరో రూ.1,51,372
కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో
ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది.
అలాగే, ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు
చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. ఇవికాక
సుమారు రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు
చర్చల దశలో ఉన్నాయి.
24 కంపెనీల పనులకు భూమిపూజ : వచ్చే మార్చిలోగా 24 కొత్త కంపెనీలకు అనుమతులు
మంజూరు చేసి భూమిపూజ చేయించి, వాటి నిర్మాణం ప్రారంభించేలా కూడా అధికారులు
ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రంలోకి కొత్తగా రూ.24,038
కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 54,019 మందికి ఉపాధి లభిస్తుంది. అదానీ గ్రూపు
వైజాగ్ టెక్‌పార్క్ పేరుతో రూ.14,634 కోట్లతో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్,
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ రూ.3,982
కోట్లు, రూ.1,500 కోట్లతో మల్క్ హోల్డింగ్స్ అల్యూమినియం తయారీ యూనిట్‌తోపాటు
పలు ఫార్మా, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పనులు ప్రారంభించేలా ప్రణాళిక
సిద్ధంచేశారు.
అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ
అమర్నాథ్
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఇన్ఫోసిస్
వంటి అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి
ముందుకొస్తున్నాయి. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా రెండో ఏడాది కూడా మొదటి
స్థానంలో నిలవడం పరిశ్రమల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న
ప్రాధాన్యతకు నిదర్శనం. రానున్న కాలంలో ప్రతినెలా ఒక భారీ పరిశ్రమ
ప్రారంభోత్సవం, శంకుస్థాపన ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేశాం.