నేపథ్యంలో రాష్ట్రానికి సంబందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను నేడు ప్రకటించడం
జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
బుధవారం అమరావతి సచివాలయం నాల్గోబ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన
పాత్రికేయులతో మాట్లాడుతూ మొత్తం 3,98,54,093 మంది సాధారణ, సర్వీస్ ఓటర్లతో ఈ
ముసాయిదా జాబితా ఖరారు చేయడం జరిగిందన్నారు. ఈ మొత్తం ఓటర్లలో 3,97,85,978
మంది సాధారణ ఓటర్లు కాగా మిగిలిన 68,115 మంది సర్వీసు ఓటర్లని ఆయన తెలిపారు.
అదే విధంగా ఈ మొత్తం ఓటర్లలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు, 1,97,15,614 మంది
పురుష ఓటర్లు కాగా మిగిలిన 3,858 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లని ఆయన
వివరించారు. జనాభా నిష్పత్తి ప్రకారం 724 మంది ఓటర్లు, లింగ నిష్పత్తి ప్రకారం
1,025 మంది ఓటర్లు ఉన్నారన్నారు. తుది ఓటర్ల జాబితా-2022 తదుపరి ఈ ముసాయిదా
ఓటర్ల జాబితాలో 2,41,463 మందిని ఓటర్లుగా నమోదు చేయడం జరిగిందని, 11,23,829
మంది తొలగించడం జరిగిందన్నారు. ఈ తొలగించిన ఓటర్లలో 40,345 మంది
మరణించినట్లుగా, 31,158 మంది వేరే ప్రాంతాలకు తరలి పోయినట్లుగా మరియు
10,52,326 మంది ఓటర్ల పేర్లు పునరావృతం అయినట్లుగా గుర్తించడం జరిగిందని
తెలిపారు. ఓటర్ల జాబితాలో బహుళ ఎంట్రీలతో పాటు ఫొటో, జనాభా పరంగా సారూప్యంగా
ఉన్న ఓటర్లను తొలగించేందుకు ఒక ప్రత్యేక సాప్టువేర్ ను అభివృద్ది పర్చడం
జరిగిందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా గత ఓటర్ల జాబితాలో భారత ఎన్నికల సంఘం
గుర్తించిన ఓటర్ల వివరాలను ఇ.ఆర్.ఓ.ల పరిశీలనకోసం అందుబాటులో ఉంచగా, పరిశీలన
తదుపరి 10,52,326 మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడం జరిగిందని ఆయన
తెలిపారు. ఈ విధంగా గత ఏడాది ఓటర్ల జాబితాతో పోలిస్తే ప్రస్తుత ముసాయిదా
ఓటర్ల జాబితాలో 8,82,366 మంది ఓటర్లు తగ్గినట్లు ఆయన తెలిపారు.ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం అత్యధిక స్థాయిలో
ఓటర్లు ఉన్న జిల్లాలు వరుసగా అనంతపురం (19,13,813 ఓటర్లు), కర్నూలు (19,13,654
ఓటర్లు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (18,99,103 ఓటర్లు) జిల్లాలు
నిలిచాయని, అదే విధంగా అత్యల్ప స్థాయిలో ఓటర్లు ఉన్న జిల్లాలు వరుసగా
అల్లూరిసీతారామరాజు (7,15,990 ఓటర్లు), పార్వతీపురం మన్యం (7,70,175 ఓటర్లు)
మరియు బాపట్ల (12,66,110 ఓటర్లు) జిల్లాలు నిలిచాయని ఆయన తెలిపారు.
ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబందించి క్లైమ్స్
మరియు అభ్యంతరాలను ఈ ఏడాది డిశంబరు 8 వరకూ స్వీకరించడం జరుగుతుందన్నారు.
ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నవంబరు 19,20 మరియు డిశంబరు 3,4
తేదీల్లో ప్రత్యేక క్యాంపైన్లను కూడా నిర్వహించడం జరుగుచున్నదన్నారు. 2023
జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వాళ్లు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అర్హులని,
2023 ఏప్రిల్, జూలై & అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వాళ్లు కూడా ఓటర్లుగా
నమోదు అయ్యేందుకు ముందుగా ధరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ సారి
నిరాశ్రయులకూ ఓటరు కార్డు ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించిందని, ఎలాంటి
గుర్తింపూ లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డు జారీ చేయడం జరుగుతుందని
ఆయన తెలిపారు. 2023 జనవరి 5 న తుది ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని
ఆయన తెలిపారు.
అదే విధంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల
అధికారి సమాదానం చెపుతూ ఓటరు కార్డు కోసం ఆధార్ ను తప్పనిసరి చేయటం జరుగలేదని,
అయితే ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే 60 శాతం మేర పూర్తి
అయ్యిందని ఆయన తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో వాలంటీర్ల సేవలను
వాడుకోవద్దని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలను జారీచేశామన్నారు. ఎమ్మెల్సీ
పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై
విచారణ జరిపి తప్పుడు ధృవీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం డిప్యూటీ సెక్రటరీ వెంకటేశ్వరరావు
సమావేశంలో పాల్గొన్నారు.