రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
1వ డివిజన్ 3 వ వార్డు సచివాలయం పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన
ప్రభుత్వం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కుల, మతాలకు అతీతంగా
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరినట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 1 వ
డివిజన్ 3 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో
కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్మిల్ నగర్లో
విస్తృతంగా పర్యటించి 120 గడపలను సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ
సంక్షేమ పథకాల బుక్ లెట్లను అందజేశారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల కోసం
ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు ప్రభుత్వ పథకాలే పేదలను వెతుక్కుంటూ
గుమ్మం వద్దకు వస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్
రెడ్డి ఏమైనా హామీనిస్తే అది నూటికి నూరు శాతం అమలు చేస్తారనే బలమైన నమ్మకం ఈ
మూడున్నరేళ్లలో ప్రజలలో ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి
గ్రీవెన్స్ స్వీకరించారు.
ప్రజల అవసరాల దృష్ట్యా శివారు కాలనీలలోని ప్రతిఒక్క ఇంటికీ మంచినీటి కనెక్షన్
ఇవ్వవలసిందిగా వీఎంసీ సిబ్బందికి సూచించారు. అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు
పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వంతెన క్రింద పేరుకున్న చెత్తను తొలగించి.. ఆ
ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కూలిన, పగుళ్లిచ్చిన సైడ్ డ్రెయిన్లను
పున:నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్మిల్ నగర్లో అంతర్గత
రహదారుల నిర్మాణాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా తెలిపారు. అనంతరం
ఈబీసీ నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ పత్రాల కోసం బడేటి
రమణ అనే మహిళ తొలిరోజు పర్యటనలో కోరగా.. నేడు ఎమ్మెల్యే చేతులమీదుగా
అందజేశారు.
విభిన్న ప్రతిభావంతులకు మరింత చేయూత : దివ్యాంగులను మరింత ప్రోత్సహించే దిశగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తోందని మల్లాది
విష్ణు తెలిపారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని
వచ్చే నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా 1,750 మందికి మూడు చక్రాల మోటార్ వెహికల్స్
ను అందించనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో 80 శాతం వైకల్యం ఉంటేనే
వాహనాలకు అర్హులుగా గుర్తించేవారని.. దానిని ఈ ప్రభుత్వం 70 శాతానికి తగ్గించి
నిబంధనలను సరళతరం చేసినట్లు పేర్కొన్నారు. తద్వారా మరింత మందికి లబ్ధి
చేకూరుతుందని తెలియజేశారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకుని.. ఈనెల 15 కల్లా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం
మీడియాతో మాట్లాడారు.
టీడీపీవి చౌకబారు ఆరోపణలు : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను అనేక
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు
కీర్తిస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాలని సాక్షాత్తూ మహేంద్ర సత్యం అధినేత తన
కుమారునికి చెప్పడం, సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనదక్షతకు అద్దం పడుతోందన్నారు.
అదే చంద్రబాబు గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని
విమర్శించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పారదర్శక
పాలనను సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేశారన్నారు. అది చూసి ఓర్వలేక ఈ
ప్రభుత్వంపై పచ్చ నేతలు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
నందిగామ ఘటనపై కావాలనే రాద్ధాంతం చేస్తూ ప్రజలలో తప్పుడు సంకేతాలు
పంపుతున్నారని దుయ్యబట్టారు.
వాస్తవానికి రౌడీలు, గూండాలందరూ టీడీపీలోనే ఉన్నారని, గత తెలుగుదేశం
ప్రభుత్వంలో నగరంలో చోటుచేసుకున్న భయానక ఘటనలు, దౌర్జన్యాలే ఇందుకు
నిదర్శనమన్నారు. వరుస దాడులు, అరాచకాలతో విజయవాడలో భయానక వాతావరణాన్ని
సృష్టించారని, ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై జరిగిన దాడిని నగర ప్రజలు
నేటికీ మరచిపోలేదన్నారు. కనుకనే టీడీపీని తగిన రీతిలో ప్రజలు సాగనంపారని,
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాష్ట్రంలో మరలా ప్రశాంతత
నెలకొందన్నారు. మరోవైపు గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని గతంలో మాట్లాడిన
తెలుగుదేశం నేతలు మరలా ఏ ముఖం పెట్టుకుని ఆయనను కలిశారో సమాధానం చెప్పాలని
మల్లాది విష్ణు ప్రశ్నించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు
శైలజారెడ్డి, నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం,
ఏఎంహెచ్ఓ శ్రీదేవి, నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, ఆళ్ల
ప్రసాద్ రెడ్డి, బండి వేణు, మండాది వెంకట్రావు, ఆర్టీసీ శ్రీను, నాగరాజు,
పావని, అనంత లక్ష్మి, సువార్త, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు
పాల్గొన్నారు.