– చిన్న సమస్యనూ రాష్ట్ర సమస్యగా చిత్రీకరించేయత్నం
– ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి
– వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయం ఖాయం
– ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
– 32వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎల్లోమీడియాను
అడ్డుపెట్టుకుని చిన్న సమస్యను కూడా రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని
మండిపడ్డారు. మంగళవారం నగరంలోని 32వ డివిజన్లో కార్పొరేటర్ కమల్భూషణ్తో
కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్లుగా
ఆయా కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కలిగిన లబ్ధిని వివరించారు.
స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని
అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైఎస్
జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చి
మూదున్నరెళ్ళయిందన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి
కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎవరిని పలుకరించినా సంతృప్తి,
ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. మూడేళ్లలోనే ఏకంగా లక్షా 72 వేల కోట్లను
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. గతంలోలా
ఎక్కడా అవినీతి లేదని, సచివాలయ వ్యవస్థతో అర్హులందరికీ పథకాలు
చేరవేస్తున్నామని తెలిపారు.
కానీ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చిన్న చిన్న సమస్యలను కూడా రాష్ట్ర
సమస్యలుగా చిత్రీకరిస్తూ అల్లర్లు సృష్టించే కార్యక్రమాలు చేపడుతున్నాయని
విమర్శించారు. తమకు అనుకూలమైన మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయం
చేస్తున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజాప్రతినిధులంతా గడప
గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును పరిశీలిస్తున్నామన్నారు.
ప్రతిపక్షాలకు ధైర్యముంటే వాళ్లు కూడా జనంలోకి వచ్చి విచారణ చేసుకోవాలని
సూచించారు. ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసని, ఏడాదిన్నర తర్వాత జరిగే
ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని
ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి, డిప్యూటీ
మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, డీఈ చంద్రశేఖర్, పలువురు
కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు
పాల్గొన్నారు.