మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : విద్యార్ధి దశ నుంచే క్రీడాస్ఫూర్తి వెల్లివిరియాలని మాజీ
ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో సమగ్రశిక్ష
ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య
అతిధిగా పాల్గొన్నారు. క్రీడల పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చదువుతోపాటు క్రీడలకు
ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత
కల్పిస్తున్నారని దీనిని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం నేటి యువతకు ఉందని
జిల్లా నుండి అనేక మంది క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో పేరు గడించారని ఆ
స్థాయికి వర్ధమాన క్రీడాకారులు ఎదగాలని కోరారు. ఈ పోటీలలో జిల్లాలోని ఎనిమిది
నియోజకవర్గాలకు చెందిన అండర్ 14 అండర్ 17 విద్యార్థులకు సంబంధించి ఇటీవల
నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించారన్నారు. దానిలో విజేతలుగా నిలిచిన
క్రీడాకారులు జిల్లా స్థాయిలో జరిగే క్రీడల్లో పాల్గొనడం ఆనందదాయకమని
పేర్కొన్నారు.
ఇందులో 32 అంశాలకు సంబంధించి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు
తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష ఎసిపి రోణంకి జయప్రకాష్, జిల్లా
విద్యాశాఖ అధికారి పగడాలమ్మ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి సురేఖ, జిల్లా
క్రీడాభివృద్ధి సంస్థ అధికారి మాధురీ లత, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ
పద్మావతి, జిల్లా ఒలంపిక్ సంఘ కార్యదర్శి కే సుందర్ రావు, వ్యాయామ
ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.