విజయవాడ : ప్రజారవాణా విషయంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి..
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత
సదనములో ఆర్టీసీ అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
నియోజకవర్గంలో శాఖాపరమైన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. రవాణా శాఖలో
అందిస్తున్న పౌర సేవలు, ఆన్లైన్ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేవలను
మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, కళాశాలల
సమయానుకూలంగా సర్వీసులు నడపాలన్నారు. కొన్ని ప్రాంతాలలో రద్దీ దృష్ట్యా
ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన గ్రీవెన్స్ ను
ప్రస్తావించారు. వాంబేకాలనీ నుంచి వెళ్లే సర్వీసులు కచ్చితంగా సమయపాలన
పాటించాలని.. పాయింట్లలో సకాలంలో బస్సులు ఉండేలా చూడాలన్నారు. కండ్రిక నుంచి
ఆటోనగర్ మార్గంలో బస్సు సౌకర్యం లేదని.. వయా గవర్నమెంట్ ప్రెస్ బీఆర్టీఎస్
మీదుగా నూతన సర్వీస్ కల్పించడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు వ్యయ ప్రయాసాలు
తప్పుతాయన్నారు. అలాగే వాంబేకాలనీ నుంచి రామ్ నగర్ మీదుగా ఆటోనగర్ కు కొత్త
సర్వీస్ ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు నిత్యం
వందలాది మంది ప్రయాణిస్తుంటారని.. వారి కోసం బస్టాండ్ నుంచి గవర్నమెంట్
ప్రెస్, పైపులరోడ్డు మీదుగా కూకట్ పల్లి కు కొత్త సర్వీస్ ఏర్పాటు
చేయవలసిందిగా సూచించారు. అలాగే ప్రయాణికుల నుంటి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా
ఉత్తమ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమీక్షలో డిస్ట్రిక్
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ ఎం.వై దానం., డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్
సుధాకర్, గవర్నర్ పేట-2 డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, విద్యాధరపురం అసిస్టెంట్
మేనేజర్ రాంబాబు, గవర్నర్ పేట-2 అసిస్టెంట్ మేనేజర్ అప్పాజీ పాల్గొన్నారు.