1వ డివిజన్, 3 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో సంక్షేమ,
అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం 1 వ డివిజన్ 3 వ
వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి గడపగడపకు
మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మధ్యకట్టలో విస్తృతంగా పర్యటించి 322
గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు.
పలువురు అర్జీదారులకు మంజూరైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. రేవు
దగ్గర అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన ఆయన వెంటనే కాలువలో తూటికాడ, చెత్తను
తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పర్యటనలో భాగంగా రేషన్ వాహనం ద్వారా
సరుకుల పంపిణీని పరిశీలించారు. వాహనాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి గుమ్మం
వద్దకే సరకులను అందించాలని తెలిపారు. అనంతరం స్థానిక 207 అంగన్వాడీ
కేంద్రాన్ని మల్లాది విష్ణు సందర్శించారు. చిన్నారులకు క్రమం తప్పకుండా
పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని సిబ్బందికి సూచించారు. మరోవైపు సీఎం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా
జరుగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గుణదల ఆర్వోబీ పనులను వీలైనంత త్వరగా
పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. స్టేజ్ -2 పనులకు
సంబంధించి నాబార్డు ద్వారా సుమారు రూ. 82 కోట్ల నిధులు మంజూరు కాగా.. త్వరలోనే
పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
అగ్రవర్ణ పేదలకు అండగా జగనన్న ప్రభుత్వం
ఈబీసీ నేస్తం రెండో విడతకు సంబంధించి ఇప్పటినుంచే అధికారులు, సచివాలయ సిబ్బంది
సన్నద్ధంగా ఉండాలని మల్లాది విష్ణు సూచించారు. అర్హులైన ఏఒక్కరూ పథకానికి దూరం
కాకుండా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. గతేడాది తొలివిడతగా నియోజకవర్గంలో 1,947
మందికి పథకాన్ని వర్తింపజేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.15 వేల
చొప్పున రూ. 2 కోట్ల 92 లక్షల 5 వేలు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం
జరిగిందన్నారు. 2022-23 కి గానూ పథకానికి సంబంధించి దరఖాస్తులు
స్వీకరిస్తుండగా.. అర్హులైన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని
కోరారు. ఈనెల 14 కల్లా సంబంధిత పత్రాలను వార్డు సచివాలయాలలో అందజేయవలసిందిగా
సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా
పూర్తిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు కాదు.. ‘గోబెల్స్’ బాబు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కొత్త కొత్త
డ్రామాలకు తెరదీస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
విమర్శించారు. ముఖ్యంగా జగ్గయ్యపేటలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని
పేర్కొన్నారు. 2019 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు టీడీపీ 23
సీట్లకు పరిమితం కాగా అందులోనూ సగం మంది ఇప్పటికే పార్టీని వీడారని
గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ పార్టీ బంగాళాఖాతంలో కలిసిందో చంద్రబాబు విజ్ఞతకే
వదిలేస్తున్నామన్నారు. అది కప్పిపుచ్చుకునేందుకు, టీడీపీ భూస్థాపితం కాకుండా
కాపాడుకునేందుకు చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని
పేర్కొన్నారు. చూస్తుంటే ప్రతిపక్ష నేత పూర్తి గోబెల్స్ బాబుగా మారిపోయారనే
అనుమానం వ్యక్తమవుతోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే
చంద్రబాబు పేదల కోసం చేసిన ఒక్క మంచి పనిలేదని మల్లాది విష్ణు విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు
రీయింబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు జ్ఞప్తికి వస్తాయన్నారు.
అదే స్ఫూర్తితో పాలన సాగిస్తూ.. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన సహా ప్రజల
జీవన స్థితిగతులను మెరుగుపరిచే అనేక పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
దిగ్విజయంగా అమలు చేస్తున్నారన్నారు. అలా చంద్రబాబు పేరు వింటే గుర్తొచ్చే
ఒక్క పథకమైనా ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం
చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి ఎన్నికలలో
మరోసారి టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్
కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఏఎంహెచ్ఓ శ్రీదేవి, నాయకులు కొండా మహేశ్వర్
రెడ్డి, ఉద్ధంటి సురేష్, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, బండి వేణు, నాగరాజు, యలమంద,
రమా, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.