మచిలీపట్నం, అభి మీడియా బ్యూరో ప్రతినిధి : జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు చేసిన ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గురువారం ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రం కృష్ణా యూనివర్సిటీలోని మీడియా సెంటర్ లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరగబోవు కౌంటింగ్ కు సంబంధించి సదుపాయాలు, ఇంటర్నెట్ సౌకర్యం, బారికేడింగ్, సెక్యూరిటీ, సీసీటీవీల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గాల వారీగా 14 టేబుల్ లను సక్రమంగా ఏర్పాటు చేశారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలు భద్రతా సిబ్బంది పర్యవేక్షణతో పాటు సీసీటీవీల పనితీరు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ హాల్లో ఎవరైనా అవాంతరాలు లేదా గొడవలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపటం జరుగుతుందని హెచ్చరించారు. లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్ హాల్ నుండి బయటకు పంపడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టడానికి అనుమతులు లేవని, ఈ అంశాలపై జిల్లా ఎస్పీ ఇప్పటికే పలు సమావేశాల ద్వారా పోటీ చేసిన అభ్యర్థులకు అవగాహన కలిగించినట్లు గుర్తు చేశారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.