త్వరలో మహిళా శక్తి పాలసీ..నాణ్యతే కొలమానం
ప్రాజెక్ట్ ద్వారా మెరుగైన శిక్షణ అందిస్తాం
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా
హైదరాబాద్ : మహిళా సంఘాల ఆర్ధిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆదిశగా మహిళా సంఘాలకు మెరుగైన శిక్షణలు కల్పిస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా అన్నారు. గురువారం ఆత్మకూరు ఎస్ మండలం లో మహిళ స్వశక్తి కుట్టు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తో కలసి సందర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏక రూప దుస్తులు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో 70 లక్షల జతల దుస్తులు కుట్టిచ్చే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని అన్నారు. అన్ని జిల్లాలో 45 రోజుల్లో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ద్వారా ఎంతో బాధ్యతాయుతంగా దుస్తులు నాణ్యతతో సిద్ధం చేస్తున్నారని సూర్యాపేట జిల్లాలో పర్యటించడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో దుస్తులు ప్రయివేట్ సంస్థలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సంఘాల ఆధ్వర్యంలో కుట్టు కేంద్రాల లో ఒక్కొక్క మహిళా రోజుకు 7 జతలు అందిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ పరంగా మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల లో మహిళ కమిటీలు చేపట్టామని త్వరలో మహిళ పాలసీ చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండలంలో కట్టింగ్ మిషన్లు అందించడం జరుగుతుందని ఇకపై ప్రతి పనిలో మహిళా సంఘాలకు చేయూత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో మహిళకు మెరుగైన శిక్షణ ఇచ్చి రెడీమేడ్ దుస్తులలో చేయూత కల్పించడం జరుగుతుందని అన్నారు. తదుపరి మహిళలు కుడుతున్న తీరును పరిశీలించి జిల్లాలో 74 శాతం పూర్తి చేసినందుకు మహిళను, జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్బంగా అభినందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో 23 మండలాల్లో గల 783 ప్రభుత్వ పాఠశాలలో 43245 విద్యార్థుల దుస్తులకు గాను 62 ప్రాంతాల్లో 721 మహిళా సంఘాల సభ్యులచే ఇప్పటి వరకు 31940 మంది విద్యార్థులకు దుస్తులు సిద్ధం చేశామని అలాగే మిగిలిన దుస్తులు నిర్దేశించిన సమయం లోపు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు ఆదాయ వనరులు పెంపొందే దిశగా మెరుగైన శిక్షణ కల్పిస్తామని అలాగే ఎక్కడకూడా రాజీ పడకుండా నాణ్యమైన దుస్తులు అందిస్తున్నామని, ప్రతి విద్యార్థి పాఠశాలల పున ప్రారంభం నుండి నూతన దుస్తులు ధరించి వచ్చే విదంగా అన్ని పాఠశాలలు ప్రధానోపాధ్యాయులకు సూచనలు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ మధుసూదన్ రాజు, సి.ఈ. ఓ అప్పారావు, డి.ఈ. ఓ అశోక్, సురేష్ కుమార్, ఎంపీడీఓ, ఎంపీఓ సంజీవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.