ఇంటర్మీడియేట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్
కెరీర్ గైడెన్స్ అమలు తీరుపై సమీక్షించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, అభి మీడియా బ్యూరో ప్రతినిధి : విద్యార్థులకు పాఠశాల దశ నుండి కెరీర్ విద్యతో పాటు జీవన నైపుణ్యాలు బోధించాలని ఇంటర్మీడియేట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మెల్ బోర్న్ యూనివర్శిటీ (ఆస్ట్రేలియా) వారి సహకారంతో పైలట్ కెరీర్ విద్య కార్యక్రమ అమలు పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించిగా, ఇంటర్మీడియేట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియేట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియేట్ విద్యాశాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన ప్రణాళిక తయారుచేయాలని సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ అధికారులను కోరారు. అనంతరం సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఏడాది నుండి ఈ కెరీర్ విద్య కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం) ఎంపిక చేసిన 100 ప్రభుత్వ పాఠశాలల్లో, 20 జూనియర్ కాలేజీల్లో 8-12 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో చేయాల్సిన అంశాలపై ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేశారు. అనంతరం యూనివర్శిటీ ఆఫ్ మెల్బోర్న్ తరఫున పాల్గొన్న గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సీఈవో రాక్వెల్ షెరాఫ్ గారు కెరీర్ ఎడ్యుకేషన్ లో భవిష్య కార్యాచరణను వివరించారు. ఈ సమావేశంలో భాగంగా గత విద్యాసంవత్సరం తమ పాఠశాలల్లో సమర్థవంతంగా కెరీర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని అమలు చేసిన ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను సన్మానించారు. సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య , కేజీబీవీ సెక్రటరీ డి.మధుసూదనరావు, శామో జాయింట్ డైరెక్టర్ ఎ. సుబ్బారెడ్డి, జీసీడీవో ఏడీ రవూఫ్ ఎస్సీఈఆర్టీ ప్రతినిధి సుధాలక్ష్మి, యూనిసెఫ్ ప్రతినిధి బి.ప్రియాంక, సమగ్ర శిక్షా, పాఠశాల విద్య, ఎస్సీఈఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు.