మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ బ్యూరో ప్రతినిధి : బాధితుల గొంతు వినిపించిన మీడియా స్వేచ్ఛపై కంచర్లపాలెం పోలీసులు దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్వామి భక్తి కోసం అక్రమ కేసులు పెడుతున్న కంచర్లపాలెం పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తోందన్నారు. తప్పుడు కేసులు పెట్టిన కంచర్లపాలెం పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాడేపల్లి ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహిళలపై జరిగిన దాడిని లైవ్లో చూపించారని, సీఎం, సజ్జల డైరెక్షన్లోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ తదనంతర హింసపై సిట్ దర్యాప్తు కూడా పారదర్శకంగా జరగాలన్నారు. పోలింగ్ తదనంతరం జరిగిన హింసపై కాల్ డేటా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు తమ కాల్ డేటా బహిర్గతం చేయగలరా? అని సవాల్ విసిరారు. రాజేంద్రనాథ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, రఘురామిరెడ్డి చేసిన తప్పిదాలకు కిందిస్థాయి ఉద్యోగులు బలయ్యారని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.