టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో వైభవోపేతంగా శోభాయాత్ర
శోభాయాత్రలో పాల్గొన్న భూమన అభినయ్
గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని, వేపాకు ధరించి గంగా ప్రవాహంలా కదిలిన భక్తులు
ఆకట్టుకున్న కళా ప్రదర్శన
తిరుపతి బ్యూరో ప్రతినిధి : గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. జాతరలో భాగంగా టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వైభవోపేతంగా శోభా యాత్ర నిర్వహించారు. తిరుపతి తొలి గడప అయిన అనంత వీధి నుంచి ప్రారంభమైన యాత్ర పట్నూలు వీధి, రామచంద్ర పుష్కరిణి, ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి ప్రాంతాల నుంచి గంగమ్మ ఆలయం వరకు కొనసాగింది. భక్తులు తమ భక్తి విశ్వాసాలు చాటుతూ, గంగానది ప్రవాహంలా పరవళ్లు తొక్కారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్నిక భక్తి చైతన్య యాత్రను నిర్వహించే సంప్రదాయం గత కొంత కాలంగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో స్థానిక అనంతవీధిలో గంగమ్మ తల్లికి భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని, వేపాకు ధరించి మాతంగి వేషంతో పాటు పౌరాణిక వేష ధారణలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శోభా యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాత్ర ఆద్యంతం భక్తులు పసుపు నేళ్లు కుమ్మరిస్తూ, కర్పూర హారతులిస్తూ స్వాగతించారు. నవదుర్గలు, తప్పేటగుళ్లు, డప్పులు,తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులి వేషాలు, గరగల్లు, బోనాల కళా ప్రదర్శనలు ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష పాల్గొన్నారు.