రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాకు ఎంఈఓ – 1 అసోసియేషన్ లేఖ
విజయవాడ బ్యూరో ప్రతినిధి : 2024 ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో సెక్టార్ ఆఫీసర్స్ గా విధులు నిర్వహించిన ఎంఈఓ లకు, ఇతర శాఖల అధికారులకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాదిరిగా ఒక నెల జీతం గౌరవ వేతనంగా చెల్లించాలని మండల విద్యాశాఖ అధికారుల సంఘం -1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం కోరారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాకు ఆదివారం లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేశారు.
2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికల విధులు నిమిత్తం గత ఏడాది నవంబర్ నెల నుండి 2024 మే నెల 14వ తేదీ వరకు దాదాపు ఆరు నెలల కాలం సెక్టార్ ఆఫీసర్స్ గా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల ప్రకారం ఎన్నికల విధులను నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల గౌరవ వేతనం కు సంబంధించి ఇటీవల మన పొరుగు రాష్ట్రం తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో సెక్టార్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించిన వారికి ఒక నెల జీతం గౌరవ వేతనంగా చెల్లించారన్నారు. కావున మన రాష్ట్రంలో కూడా మన ప్రక్క రాష్ట్రం మాదిరిగా సెక్టార్ ఆఫీసర్స్ గా విధులు నిర్వహించిన ఎంఈఓ లు, ఇతర శాఖల అధికారులకు ఒక నెల జీతం గౌరవ వేతనంగా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేసినట్లు ఎంఈఓ 1 అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం తెలిపారు.