ఎక్కడా సీటు దొరక్క చివర్లో ఇక్కడకొచ్చి డోన్ అభివృద్ధిపై విమర్శలా?
టీడీపీకి మంచి చెబితే వినపడదు..అభివృద్ధి చేస్తే కనపడదు
పసిపిల్లల భవిష్యత్ కు పండుముసలి భరోసానా? భవిష్యత్ కు గ్యారంటీనా?
ముప్ఫై ఏళ్లలో మీరు కుప్పానికి చేయనిది..మూడేళ్లలోనే డోన్ కు చేశాం
రాసిచ్చిన స్లిప్ లు చూసి చదివితే అభివృద్ధి కనబడుతుందా?
డోన్ పాత బస్టాండ్ సర్కిల్ లో గిర్రున తిరిగి చూస్తే అభివృద్ధి కనబడేది కదా?
కొత్తపల్లె కళాకారులను రాబోయే రోజుల్లో ఆదుకుంటాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 టీడీపీ కుటుంబాలు
యు.కొత్తపల్లె, సీసంగుంతల, ఉంగరానిగుండ్ల గ్రామల్లో మంత్రి బుగ్గన ప్రచారం
నంద్యాల బ్యూరో ప్రతినిధి : టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కన్నా డోన్ మూడింతల అభివృద్ధి సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి మంచి చెబితే వినపడదు. అభివృద్ధి చేస్తే కనపడదని ఆయన విమర్శించారు. నేటి పసిపిల్లల భవిష్యత్ కు పండు ముసలి వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా గ్యారంటీ, భరోసా ఇస్తారో చెప్పాలన్నారు. ముప్ఫై ఏళ్లలో చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గంలో చేయని అభివృద్ధి కోవిడ్ అనంతరం మూడేళ్ల పాలనలోనే డోన్ ను అభివృద్ధి చేశామన్నారు. రాసిచ్చిన స్లిప్ లు చూసి చదివితే అభివృద్ధి కనపడదన్నారు. సోమవారం డోన్ పాతబస్టాండ్ సర్కిల్ లో సభ నిర్వహించుకున్న చంద్రబాబు ఒక్కసారి గాంధీ బొమ్మ నుంచి మొదలుపెట్టి గిర్రున తిరిగి చూస్తే అభివృద్ధి కళ్లకు కట్టేదన్నారు. మంగళవారం డోన్ మండలంలోని యు.కొత్తపల్లి, సీసంగుంతల, ఉంగరానిగుండ్ల గ్రామాల్లో ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలన్నీ నీటి మూటలన్నారు. ఆశ పెట్టిన నాయకుడు ఆచరణలో చూపుతాడా లేదా అని కూడా ప్రజలు ఆలోచించాలన్నారు. గ్యాస్ సబ్సిడీ, మహాలక్ష్మి పథకాల పేరుతో 2014లో మహిళలను దారుణంగా మోసం చేయడం వారు ఇంకా మరవలేదన్నారు. విద్యార్థులకు బస్ పాస్ రాయితీలివ్వడాన్ని సైతం చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో వ్యతిరేకించిన విషయం వాస్తవం కాదా అన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయం లేకుండా ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడం దేశంలోనే ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు.
ఎక్కడా సీటు దొరక్క డోన్ కు వచ్చిన వాళ్లు కూడా విమర్శించడమా? : మంత్రి బుగ్గన
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపైనా మండిపడ్డారు. ఎక్కడా సీటు ఇవ్వమని ఖరాఖండిగా చెప్తే..చివర్లో ఏదీ దొరక్క డోన్ కు వచ్చిన వారు కూడా విమర్శించడం హాస్యాస్పదమన్నారు. 40 ఏళ్ల కాలంలో రైల్వే కేంద్ర మంత్రిగానూ పదవులు చేపట్టి డోన్ కు ఒక్క మంచి పనైనా చేశారా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చెప్పింది చెప్పినట్లు అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు రుణమాఫీ, డ్వాక్రాల వడ్డీ మాఫీ అమలు చేసింది సీఎం జగన్ కాదా? అన్నారు. వృద్ధులకు పింఛన్లు ఇంటికి వెళ్లి వాలంటీర్ల ద్వారా ఇవ్వకుండా చేసిన చంద్రబాబు బాబు పింఛన్లు పెంచుతాడంటే నమ్ముతారా అన్నారు. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఐదేళ్లకు రూ.1,20,000 వైఎస్ఆర్ చేయూత, పింఛన్ రూ.3500, రైతులకు రాబోయే ఐదేళ్లలో రూ.80వేల భరోసాను ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. డోన్ లో డబులు రోడ్లు, డబ్లింగ్ లైట్లు, కేంద్రీయ విద్యాలయం, ఐడీటీఆర్ , సెంట్రల్ లైటింగ్, బస్టాండ్, కాలేజీ, స్కూల్, టీటీడీ కల్యాణ మండపం, 100 పడకల ఆస్పత్రి, వాటర్ గ్రిడ్ ద్వారా రూ.351 కోట్లతో తాగునీరిచ్చే కార్యక్రమాలు అభివృద్ధి కాక మరేమిటన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి బేతంచెర్లలో శుద్ధి చేసిన నీరు ప్రతి ఇంటికీ నెలరోజుల్లో సరఫరా చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గుండాల క్షేత్రానికి రూ.15 కోట్లతో రహదారి ఏర్పాటు అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. సొంత ఊరు కోడుమూరులోని లద్ధగిరికి ‘కోట్ల’ కుటుంబం రోడ్డు ఎందుకు వేయలేకపోయిందో చెప్పాక డోన్ అభివృద్ధి మీద మాట్లాడొచ్చన్నారు. రూ.70 కోట్లతో రెండు బ్రిడ్జిలు ఏర్పాటు చేసి సర్వీస్ రోడ్లను వేసి స్థానిక ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలను కాపాడడాన్ని ఏమంటారో చెప్పాలన్నారు. ఘర్షణలే లేని డోన్ గా గత పదేళ్లలో ఊహించని విధంగా శాంతిభద్రతలు అమలు చేస్తున్నామన్నారు. వచ్చిన 15 రోజుల్లోనే రౌడియిజం మొదలు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఓటుతో మీ భవిష్యత్ ను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీ ఇంట్లో మంచి జరిగుంటే ఓటు వేయమన్న సీఎంను గతంలో చూశారా? అనడిగారు. రాబోయే ఎన్నికల్లో అంతులేని వాత్సల్యంతో నంద్యాల ఎంపీగా ఓటు పోచా బ్రహ్మానందరెడ్డికి, డోన్ ఎమ్మెల్యేగా ఓటు మీ బుగ్గన రాజారెడ్డికి ఫ్యాన్ గుర్తుపై వేయాలన్నారు.
డోన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 టీడీపీ కుటుంబాలు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మంత్రి బుగ్గన సమక్షంలో 200 మంది టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. మంగళవారం ఉదయం పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీ నుంచి 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాయి. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా యు.కొత్తపల్లి గ్రామ నాయకుల సమక్షంలో 100 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ప్రచారం ముగించుకుని వచ్చిన తర్వాత డోన్ లోని మంత్రి క్యాంప్ కార్యలయంలో ఇంద్రంపల్లె నుంచి షేక్ షావలి సమక్షంలో మంత్రి బుగ్గన నాయకత్వంలో 10 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాయి. అంతకు ముందు మల్లెంపల్లి గ్రామానికి చెందిన 30 టీడీపీ కుటుంబాలు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ రామచంద్రుడు సమక్షంలో 30 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నాయి.