రెడీమేడ్ నాయకులను ప్రజలు నమ్మబోరు
కులమతాలకు అతీతంగా ఉండే పశ్చిమలో పెత్తందారులకు చోటులేదు
వైసీపీకి ఓటు వేస్తే మరో ఐదేళ్లు సంక్షేమ పథకాలు ప్రజల ఇంటికే వస్తాయి
కూటమికి ఓటు వేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే
వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్
విజయవాడ బ్యూరో ప్రతినిధి : బ్యాంకులను మోసం చేసినట్లు ఓటర్లను మోసం చేయడం సాధ్యం కాదని కూటమి అభ్యర్థులు గుర్తుంచుకోవాలని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. బ్యాంకులను కొల్లగొట్టి ఎన్నికల ముందు డబ్బు మూటలతో వచ్చే రెడిమేడ్ నాయకులను ప్రజలు నమ్మబోరని చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి జీవనం సాగించే ఈ పశ్చిమ నియోజకవర్గంలో పెత్తందారులకు చోటు లేదని ఆయన స్పష్టంచేశారు. స్థానిక 45.డివిజన్ కార్పొరేటర్. మైలవరపు మాధురి లావణ్య గారి ఆధ్వర్యంలో ఆసిఫ్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, తమ పార్టీ కార్పొరేటర్లు ఎక్కడికక్కడ స్థానికులకు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా అండగా నిలిచారని తెలిపారు. కరోనా కష్టసమయంలో కూడా వలంటీర్లు, తమ పార్టీ నేతలు, కార్పొరేటర్లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి అవసరమైన సాయం చేస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడారని గుర్తుచేశారు. ఇవాళ ఎన్నికల ముందు తమ స్వార్థం కోసం చంద్రబాబు కూటమి పేరుతో తన ముఠానే ఎన్నికల్లో పోటీకి నిలిపారని, డబ్బును వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని సుజనా చౌదరి చెబుతున్నారని, ఆయన రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకు ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా, సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉండగా విజయవాడకు, పశ్చిమ నియోజకవర్గానికి ఒక్క మంచి పని చేయలేదని, ఇప్పుడు దొంగ హామీలు, మాయమాటలు, డబ్బుమూటలతో గెలవాలని చూస్తున్నారని, అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2014లో ఇదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 650 హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన వాటితోపాటు చెప్పనివి కూడా అనేక పథకాలు అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమి నేతల మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఐదేళ్లు నేతలు ఢిల్లీ హైదరాబాద్లో ఉంటారని, మళ్లీ ప్రజలు కష్టాలు కోరితెచ్చుకున్నట్లేనని, నరకం అనుభవించాల్సి ఉంటుందన్నారు. వైసీపీకి ఓటు వేస్తే గెలిస్తే మరో ఐదేళ్లు ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు వస్తాయని, తమ పార్టీ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి నిరంతరం ప్రజాశ్రేయస్సు, సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడుతున్న వైసీపీకి ఓటు వేయాలని, స్థానికులమైన తనతోపాటు కేశినేని నానీని ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపించాలని ఆసిఫ్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి. మైలవరపు దుర్గారావు, నాయకులు ముత్త వాసు, ముత్యాల రాంబాబు, గుండు లక్ష్మి.దావాలా బుజ్జి, కిరణ్ , లక్ష్మణ్, మళ్లీ రెడ్డి, సుంకర నారాయణ, లింగయ్య, శివ, శీను, భాను, గురువయ్య, రాజేష్. ఆర్కే రెడ్డి, రాళ్లపల్లి లక్ష్మి. సల్మా సుల్తానా, నాగ పావని.స్రవంతి, దుర్గ తదితర నాయకులు పాల్గొన్నారు.