విజయోత్సవ ర్యాలీని తలపించిన మంత్రి బుగ్గన నామినేషన్ ర్యాలీ
అభివాదం చేసిన ఆర్థిక మంత్రిని మనసారా ఆశీర్వదించిన ప్రజలు
రెండుసార్లు టీడీపీ అభ్యర్థిని మార్చిన చంద్రబాబు ఎవరికి ష్యూరిటీ? దేనికి గ్యారంటీ?
‘కోట్ల’ఆత్మ క్షోభించేలా టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాశ్ రెడ్డి పనులు
అభివృద్ధి చూపిస్తాం రమ్మని సవాల్ విసిరి వారమైనా ‘కోట్ల’ నుంచి స్పందన లేదు
సారా కాయడం, దొంగ మైనింగ్ చేసుకోమనడమా మీరు చెప్పే అభివృద్ధి?
మీ సొంత గ్రామం లద్దగిరికి కూడా వచ్చే మా ప్రభుత్వంలో రోడ్డేస్తాం
నామినేషన్ దాఖలు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్థిక మంత్రి బుగ్గన
నంద్యాల జిల్లా బ్యూరో ప్రతినిధి,: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ పట్టణంలో చేపట్టిన నామినేషన్ ర్యాలీ ఎన్నికల అనంతర విజయోత్సవ ర్యాలీని తలపించింది. వేలాది మంది ప్రజలు తరలివచ్చి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను రోడ్డు పొడవునా మనసారా చిరునవ్వులతో ఆశీర్వదించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం మంత్రి స్వగృహం నుంచి పూలవర్షంలో భారీ ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కండువాలు, టోపీలు ధరించి పార్టీ జెండాలను సూచించే బెలూన్లను పట్టుకుని మంత్రి వాహనం వెంట నడుస్తూ మంత్రి బుగ్గనను నడిపించారు. నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు చిన్నారులు సైతం మంత్రికి అభివాదం చేశారు. జై జగన్..జై బుగ్గన నినాదాలతో పాత బస్టాండ్ సర్కిల్ మార్మోగింది. ఇందిరా నగర్ లో దుకాణాలు, హోటళ్ల వ్యాపారులు, అపార్టుమెంటుల్లో కుటుంబాలు మంత్రి బుగ్గనకు చేతులెత్తి దండం పెడుతూ తమ మద్దతు తెలిపారు. మళ్లీ గెలిచేది రాజారెడ్డే..వచ్చేది జగన్ ప్రభుత్వమే అంటూ నినాదాలు చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం మంత్రి నామినేషన్ ర్యాలీకి మండుటెండను సైతం లెక్కచేయకుండా పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక డ్రోన్ సాయంతో పూలవర్షం కురిపించడంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు కదిలారు. కంబాలపాడు సర్కిల్ దాటాకా ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదివే ఓ చిన్నారి జై జగన్ అంటూ జేజేలు పలికింది. అనంతరం తరగతులు ముగించుకుని ఇంటికి వెళ్తోన్న ప్రభుత్వ పాఠశాల చిన్నారులంతా ప్రహరీ గోడ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ముక్తకంఠంతో జై జగన్ మామయ్యా అంటూ కేరింతలు కొట్టారు. ఆ తర్వాత మంత్రి బుగ్గన ర్యాలీ ఫ్లై ఓవర్ కింద నుంచి పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరగానే భారీ గజమాలతో అభివృద్ధికి కృతజ్ఞతగా పార్టీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. మంత్రి బుగ్గన కోసం వచ్చిన అభిమానులతో ఇంటిగ్రేటెడ్ వెజిటెబుల్ మార్కెట్ నిండిపోయింది. పార్టీ రంగులతో తయారు చేసిన బెలూన్లను పార్టీ నాయకులు గాల్లోకి వదిలారు. రంగురంగుల పేపర్లు, పువ్వులను ఆకాశం నుంచి కురిపిస్తూ మంత్రి బుగ్గన కోసం ఏర్పాటు చేసిన డ్రోన్ తో గాంధీ సర్కిల్ లో సందడి వాతావరణం నెలకొంది.
ఎవరికి ష్యూరిటీ? దేనికి గ్యారంటీ? చంద్రబాబూ?
డోన్ పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. తారకరామనగర్, ఇందిరానగర్, కంబాలపాడు సర్కిల్, పోలీస్ స్టేషన్ , పాత బస్టాండ్ ప్రాంతాల మీదుగా గాంధీ సర్కిల్ చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. డోన్ లో టీడీపీ అభ్యర్థిని ప్రకటించి రెండు సార్లు మాట తప్పి మరొకరికి అవకాశమిచ్చిన చంద్రబాబు ఏ విధంగా గ్యారంటీ, దేనికి ష్యూరిటీయో చెప్పాలని మంత్రి బుగ్గన వెల్లడించారు.మాట తప్పిన వారికి, ఇచ్చిన మాటకు కట్టుబడే వారికి మధ్యన ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఆడపిల్లలకు పుట్టగానే రూ.25వేలు, మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, విద్యార్థులకు బస్ పాసులిస్తామని చంద్రబాబు మోసం చేశారన్నారు. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు 25 ఏళ్ల యువతీయువకుల భవిష్యత్ ను ఎలా నిర్మిస్తారో చెప్పాలన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట కోసం నిలబడే మనిషన్నారు. 2014 లో వైఎస్ జగన్ తనను నమ్మి మొట్ట మొదటి అభ్యర్థిగా డోన్ లో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.
ఎంత మంది వచ్చి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి మార్చమన్నా మాట మీద నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.
‘కోట్ల’ఆత్మ క్షోభించేలా కుటుంబ సభ్యుల చేష్టలు
స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆత్మ క్షోభించేలా డోన్ టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాశ్ రెడ్డి మాటలు, చేతలు ఉంటున్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. డోన్ విపక్షాలకు అభివృద్ధి చూపిస్తాం రమ్మని తాను కోట్లకు సవాల్ విసిరి వారమైనా కనీస స్పందన లేదని మంత్రి బుగ్గన మరోసారి వెల్లడించారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి డోన్ నియోజకవర్గానికి భవిష్యత్ లో తాగునీటి కొరత లేకుండా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. 36 చెరువులకు నీరు నింపడం, 100 పడకల ఆస్పత్రి నిర్మాణం, బీసీ, ఎస్సీలకు ప్రత్యేక పాఠశాలల ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయం, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్, మున్సిపల్ ఆఫీస్, ఐటీడీఆర్ ప్రాజెక్టులు అభివృద్ధి కాదా? అన్నారు. చంపినవారిని పక్కన పెట్టుకుని తిరిగే మీకు అభివృద్ధి గురించి ఏం తెలుస్తుంది? అన్నారు. నాడు మీరు ప్రజల కోసం కలిసుంటే 100కు పైగా మహిళలు తమ భర్తలను కోల్పోయేవారా? అన్నారు. అభివృద్ధి గురించి తెలిసిన వారైతే కోట్ల స్వగ్రామానికి రోడ్డెందుకు వేయలేకపోయారు? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైల్వే కేంద్ర మంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేసిన పని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? చెప్పాలన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిజంగా భోగీల ఫ్యాక్టరీ తెచ్చి ఉంటే రాజకీయాల నుంచి వైదొలుగుతా అని నాడు కేఈ ప్రకటించిన మాట వాస్తవం కాదా అన్నారు. సబ్ కోర్టును డోన్ లో ఎందుకు కట్టలేకపోయారో చెప్పాలన్నారు. రూ.23 కోట్లతో మా ప్రభుత్వ హయాంలో సబ్ కోర్టును నిర్మిస్తున్నామన్నారు. రూ.50 లక్షలతో కట్టించాలనుకున్న పాఠశాల భవనాన్ని నాడు ఇద్దరు ‘కేకేలు’ అనుమతుల పేరుతో ఆపింది నిజం కాదా అంటూ మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో నాయీ బ్రాహ్మణుల స్థలాలను ఆక్రమించుకున్నారు, ప్రతి పనికి కప్పం వసూలు చేసిన జ్ఞాపకాలను డోన్ ప్రజలు నేటికీ మరవలేదన్నారు. బియ్యం, పప్పు కూడా దోచుకున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ.. బేతంచెర్ల పర్యటనలో మళ్లీ సారా కాసుకోండి, మైనింగ్ లో దోచుకోండని చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇదేనా మీరు చేయబోయే అభివృద్ధి? పెట్టబోయే పరిశ్రమలివేనా అని సూటిగా ప్రశ్నించారు.రారా..రారా..రాకపోతే కాళ్లు విరగ్గొడతారా అంటూ తెలుగుదేశం పార్టీలోకి బెదిరించి ఆహ్వానిస్తున్నదెవరని ప్రశ్నించారు.
ఇది మా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి
మూడు నాలుగు దశాబ్దాల నుంచి గత ప్రభుత్వాలు పట్టించుకోని గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా మా ప్రభుత్వం 3 టీఎంసీలు ప్రత్యేకంగా కేటాయింపులు చేసిందన్నారు. 4,5 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచినట్లు స్పష్టం చేశారు. కోడుమూరు మండలానికి కూడా మా ప్రభుత్వమే నీరిచ్చిందని మంత్రి వెల్లడించారు. కంబగిరి, గుండాల, మద్దిలేటి స్వామి ఆలయాభివృద్ధి చూసి మాట్లాడాలని వినయంగా కోరుతున్నట్లు చెప్పారు. జగన్నాథ గట్టుమీద ఎస్టీబీసీ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. న్యాయ విశ్వవిద్యాలయం నిర్మిస్తున్నామన్నారు. కోవిడ్ వలన కావాల్సినంత న్యాయం కార్యకర్తలకు జరగలేదు..మరోసారి మన ప్రభుత్వంలో కార్యకర్తలను రాజును చేస్తామన్నారు. వివేకం కలిగిన డోన్ ప్రజలు..రాష్ట్ర చరిత్రలో ఊహించని మెజారిటీతో గెలిపిస్తారని నమ్ముతున్నానంటూ మంత్రి బుగ్గన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, బేతంచెర్ల, డోన్ మున్సిపల్ ఛైర్మన్లు చలంరెడ్డి, సప్తశైల రాజేష్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, మద్దిలేటి స్వామి ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు, బేతంచెర్ల వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి, డోన్ వైసీపీ నేత మల్లెంపల్లి రామచంద్రుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.