ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్
కాకినాడ బ్యూరో ప్రతినిధి : ఎన్నికల ప్రచారానికి వ్యయ పరిమితికి మించి వెచ్చించే అవకాశం ఉన్న ఆయా అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ, అలాగే సాధారణ ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం కాకినాడ కలెక్టరేట్ లో నీనా నిగమ్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నంలో భాగంగా నగదు, బహుమతుల పంపిణీపై సీ-విజిల్ లాంటి అప్లికేషన్ల ద్వారా ఫిర్యాదు దాఖలు చేసేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. కాకినాడ జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా పనిచేయాలని ఆమె సూచించారు. కాకినాడ జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు, సన్నద్ధత ప్రణాళిక పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థుల సహా రిజిస్టరై, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల ప్రచార ఖర్చుల నమోదుపై కూడా అవగాహన కలిగి ఉండాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. బ్యాంకుల నుంచి జరిగే అనుమానాస్పద నగదు లావాదేవీలు, ముఖ్యంగా ఐదు లక్షలకు మించిన నగదు డిపాజిట్లపై, మద్యం షాపులకు వెళ్ళే సరకు రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ, అలాగే ఎన్నికల ప్రచారాన్ని తనిఖీ చేయడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలు.. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న తీరును వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, డీఆర్వో డా.డి. తిప్పే నాయక్..ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్ కు పూల బొకేలు అందజేసి, స్వాగతం పలికారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ తొలుత ఎన్నికల వ్యయ ప్రత్యక పరిశీలకులు నీనా నిగమ్ కు జిల్లాలోని వ్యయ పర్యవేక్షణ బృందాల పనితీరు గురించి వివరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, జిల్లా ఎన్నికల నియంత్రణ కేంద్రం (కంట్రోల్ రూమ్), రాజకీయ ప్రచారానికి సంబంధించిన అనుమతుల వివరాలు, జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక కార్యకలాపాలు, ఎన్నికల సంబంధిత ఇతర అంశాలపై వివరించారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ జిల్లాలో ఎన్నికల కోసం చేసిన భద్రత ఏర్పాట్లను, చెక్ పోస్ట్ వద్ద తనిఖీ అంశాలను ఆమెకు వివరించారు. యానాం సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, ఇప్పటి వరకూ సీజ్ చేసిన నగదు, మద్యం, బంగారం, గంజాయి వంటి వాటి వివరాలు, నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ల గురించి వివరించారు. అనంతరం కలెక్టరేట్ స్పందన హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ను ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్..జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, డీఎఫ్ఓ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆయా విభాగాల వారీగా నిర్వహిస్తున్న విధులను ఎన్నికల పరిశీలకురాలకు వివరించారు. సమావేశంలో డీఎఫ్ఓ ఎస్.భరణి, డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి; డీపీవో కె భారతి సౌజన్య; కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ సుమతి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీలత; సీపీవో పీ.త్రినాధ్, లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రసాద్, జిల్లా ఆడిట్ అధికారి వై.సురేష్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డీ.నాగార్జున, కాకినాడ పట్టణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జే.వెంకట్రావు; కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఈట్ల కిషోర్, పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జే. సీతారామారావు, ప్రత్తిపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏ. శ్రీనివాసరావు, జగ్గంపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం.శ్రీనివాసరావు; తుని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి, జిల్లా ఖజానా, ఆదాయపు పన్ను శాఖాధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.