పార్టీ లేకపోతే ప్రభుత్వమే లేదు: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
మీ స్వగ్రామం లద్ధగిరికే రోడ్డు వేయని మీరు..హవ్వా..డోన్ లో రోడ్లేశారా?
గతంలో చేసిన అభివృద్ధికి సాక్ష్యం లేదు..కూటమి విజన్ లో స్పష్టతా లేదు
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. బేతంచెర్ల సెంటర్ కు రావాలంటూ సవాల్
డోన్ లో పార్టీ మారినవారికి..ఎన్నికల తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
బేతంచెర్ల కరవు ప్రాంతంగా గుర్తిస్తే ప్రతిపక్షాలకెందుకు కడుపుమంట?
‘కూటమి’ తాటాకు చప్పుళ్లకు..ఉడత ఊపులకు భయపడేదెవరు?
పులివెందుల తర్వాత అభివృద్ధి చెందిన ప్రాంతం డోన్ నియోజకవర్గం
ఓడించారని ప్రజలను వదిలేసిపోయిన ‘కోట్ల’ వారి అడ్రస్ ఎక్కడ?
బేతంచెర్లలో జరిగిన ‘ఆత్మీయ సమ్మేళనంలో’ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల బ్యూరో ప్రతినిధి : కార్యకర్త లేకపోతే పార్టీ లేదు. పార్టీ లేని ప్రభుత్వమే లేదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. బేతంచెర్ల పట్టణంలో షిరిడీ సాయిబాబా కల్యాణ మండపంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో జరిగిన ‘ఆత్మీయ సమ్మేళనం’లో మంత్రి బుగ్గన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ..’కూటమి’ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇటీవల చేస్తున్న ఆరోపణలపై గట్టి కౌంటరిచ్చారు. ‘కూటమి’ తాటాకు చప్పుళ్లకు..ఉడత ఊపులకు భయపడేవారెవరూ లేరన్నారు. ఓటమి ఖాయమని అర్థమయ్యే కూటమి అంతా ఏకమై ఇంటింటి ప్రచారం చేస్తోందన్నారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు..వచ్చిన కొద్ది కాలంలో ఎవరెంత అభివృద్ధి చేశారో చూద్దామా అన్నారు. బేతంచెర్ల సెంటర్ కు వస్తే ఐదేళ్ల కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంతో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. స్వాతంత్ర్యానికి పూర్వం బుగ్గన శేషారెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు ‘కోట్ల’వారెక్కడున్నారో చెప్పాలన్నారు. ఓడించారని 15 ఏళ్లుగా డోన్ ప్రజలను వదిలేసి వెళ్లిపోయిన ‘కోట్ల’ వారి అడ్రస్ అసలు ఎక్కడో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. ఆలూరు సీటు ఇవ్వమంటే..ఎమ్మిగనూరు కుదరదంటే..ఆదోని సాధ్యపడదంటే, కర్నూలు వల్ల కాదన్నప్పుడు డోన్ గుర్తొచ్చిందా? అంటూ మంత్రి ధ్వజమెత్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడా సీటు లేని మీరు డోన్ ప్రజల మీద అజమాయిషీ చేయడానికి వచ్చారా? అంటూ ప్రశ్నించారు. మీ హయాంలో భయపడిన వారంతా మా ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛగా బతుకుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇళ్లు పట్టుకుని ప్రచారం చేస్తున్న ‘కోట్ల’ కుటుంబ సభ్యులు గత 15 ఏళ్లు ఎక్కడున్నారు? అసలు మీ చిరునామా ఎక్కడ? అంటూ ప్రశ్నలు సంధించారు. మరో 2 నెలల్లలో ‘రివర్స్ ప్లాస్మాసిస్’ పద్ధతిలో శుద్ధి చేసి మరీ డోన్ నియోజకవర్గం మొత్తం శ్రేష్ఠమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా డబుల్ రోడ్లు వేసి , మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చి డబుల్ గ్రోత్ సాధించామన్నారు. ప్రజల ప్రేమాభిమానం, ముఖ్యమంత్రి నమ్మకం వల్లే డోన్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత వైఎస్ఆర్ ఇచ్చిన ఇళ్లు ‘కోట్ల’ ఇచ్చినట్లు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ఊరి పేర్లు కూడా తెలియని మీరు..ఏం అభివృద్ధి చేస్తారో? ఆ ప్రణాళిక ఏంటో ప్రజలకు తెలియజేయాలని ‘కోట్ల’ను మంత్రి నేరుగా ప్రశ్నించారు.
మంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 కుటుంబాలు
ఆర్థిక శాఖ మంత్రి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. బేతంచెర్ల పట్టణంలో ఎస్.రంగాపురం, గూటుపల్లి, హెచ్.కొట్టాల గ్రామాలలో ఏకంగా 200 కుటుంబాలు మంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. గూటుపల్లి నుంచి 100 కుటుంబాలు, ఎస్.రంగాపురం నుంచి 70 కుటుంబాలు. హెచ్.కొట్టాల నుంచి 30 కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మంత్రి బుగ్గన స్వాగతం పలికారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మంత్రి మంచితనం నచ్చి ఆయనతో భాగస్వామ్యం అవ్వాలని నిశ్చయించుకున్నట్లు వారు స్పష్టం చేశారు. బేతంచెర్ల సహా యావత్ డోన్ నియోజకవర్గ స్వరూపాన్ని అభివృద్ధితో మార్చి మంత్రి బుగ్గన మోడల్ గా నిలిపారన్నారు. ఎన్నికల్లో సైనికుల్లా పని చేసి హ్యాట్రిక్ విజయం అందిస్తే రాబోయే రోజుల్లో అందరం కలిసి మరింత అభివృద్ది వైపు అడుగులేస్తామన్నారు.
కరవు మండలాలపైనా రాజకీయమేనా?
కరవు మండల ప్రకటనను కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దుర్మార్గమని ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. నంద్యాల జిల్లాలో కేవలం 8 మండలాలను కరవు మండలలుగా ప్రకటించిందని స్పష్టం చేశారు. బేతంచెర్లను కరవు మండలంగా చేస్తే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. కరవు మండలంగా ప్రకటించే శక్తి నిజంగా తనకి ఉంటే యావత్ కర్నూలు జిల్లా మొత్తాన్ని కరవు జిల్లాగా ప్రకటిస్తానన్నారు. ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకునే ఇంటిల్లిపాది ఇల్లిల్లు తిరుగుతున్నారన్నారు. బేతంచెర్ల వాళ్లు రాజకీయానికి ఏం పనికొస్తారని విమర్శించిన కొంతమందికి పనితీరుతోనే రాష్ట్రం గర్వించే పాలన అందించామని సమాధానం చెప్పారు.పులివెందులను వైఎస్ఆర్, వైఎస్ జగన్ అభివృద్ధి చేసినట్లు… గజ్వేల్ ను కేసీఆర్, సిద్ధిపేటను హరీష్ రావు..చేసినట్లు.. 3 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర రైల్వే మంత్రిగా పదవి చేపట్టిన కోట్ల సూర్యప్రకాశ్ స్వస్థలం లద్ధగిరికి ఏం చేశారో చెప్పాలన్నారు. కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ‘కోట్ల’ డోన్ లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. లద్ధగిరికి రోడ్డు కూడా లేకపోవడం తప్పా అభివృద్ధి గురించి ఒక్కరైనా మాట్లాడుతున్నారా? చెప్పాలన్నారు. కోచ్ ఫ్యాక్టరీ అని ఓ డబ్బాల ఫ్యాక్టరీ తెచ్చిన అది పట్టాలెక్కలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ తీసుకువచ్చిన మాటే నిజమైతే రాజకీయాలకు బై చెప్తానన్న నాటి కేఈ మాటలే అందుకు నిదర్శనమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరికీ ఫోన్ చేసి టీడీపీలోకి రావాలని పిలిచి భయపెడితే ఇక్కడ భయపడేవారెవరూ లేరన్నారు. సాయం పొంది, పనులు చేసుకుని కూడా స్వప్రయోజనాలకోసం స్వార్థంగా వలసవెళ్లిన అందరికీ ఎన్నికల తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
కోవిడ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రగతి సాధించాం
కోవిడ్ విపత్తులోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను రక్షించుకుంటూ ప్రగతి సాధించిందని మంత్రి బుగ్గన వెల్లడించారు. గత ప్రభుత్వం టీడీపీలో ఏ విపత్తూ లేకున్నా గుదిబండలా బిల్లులు పెండింగ్ పెట్టారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హత ఉన్నా సంక్షేమం అందని ఒక్క నిరుపేదనైనా చూపగలరా? అంటూ సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అన్ని విషయాల్లో మన ప్రభుత్వం మెరుగ్గా రాణించిందన్నారు. లంచంలేని ప్రభుత్వం..నిరుపేదల ప్రభుత్వం..మీ ప్రభుత్వం అని నినదించారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలను దారుణంగా మోసం చేశారని ..అందుకు నిదర్శనమే మేనిఫెస్టోలో చెప్పినా అమలు చేయని ఉచిత సిలిండర్లు, మహిళలకు రాయితీలే ఉదాహరణ అన్నారు. ఇంతవరకూ తనను వెనకుండి ముందుకునడిపించిన ప్రజలే మంత్రి బుగ్గనను గెలిపించితీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీ ఇంట్లో నా వల్ల మంచి జరిగుంటే ఓటు వేయమన్న ముఖ్యమంత్రి మాటే తనకు స్ఫూర్తి అన్నారు. టీ గ్లాస్ సింక్ లో ఉండాలి..సైకిల్ బయట ఉండాలి..ఫ్యాన్ ఇంట్లో ఉండాలన్నారు. అలాగే పక్క ఊళ్ల నుంచి వచ్చిన వాళ్లని..ప్రజలంతా ఏకమై వారి ఊళ్లకే పంపించాలన్నారు.