మూడు అంశాలపై ఫిర్యాదులను అందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదివారం వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదునందించారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని.. దోషులను వెంటనే పట్టుకోవలసిందిగా డీజీపీని కోరినట్లు చెప్పారు. అలాగే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన ఉల్లంఘనలపై ఆధారాలతో ఈసీకి ఫిర్యాదులను అందించగా స్పందించిన ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలకు సీబీ సీఐడీకి సూచించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రికి కించపరిచేలా ఫోటోలు మార్ఫింగ్ చేయడం, గొడ్డలితో పోస్టులు పెట్టడం, తెలుగుదేశం పాటలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపి చర్యలు తీసుకోవలసిందిగా డీజీపీని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం చేస్తున్న ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్ లు, బల్క్ మెసేజ్ లపైనా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రిపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని కట్టడి చేయవలసిందిగా కోరినట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రావెల కిషోర్ బాబు, అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఉన్నారు.