చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరిన సిఇఓ ముఖేష్ కుమార్ మీనా
అమరావతి, ప్రధాన ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా నున్న పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. బుధవారం సచివాలయంలోని తమ ఛాంబరులో హెపిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ చమురు పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సమావేశమై ఓటర్ల అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్దమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం కార్యక్రమం అమల్లో భాగంగా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను చమురు పరిశ్రమల ద్వారా కూడా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే పోస్టల్ శాఖ ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల ద్వారా ఓటర్ల అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలని కోరారు. ఇ.సి.ఐ.లోగోతో ఎన్నికల తేదీ, ఓటు హక్కు విలువను తెలిజేసే నినాదాలతో హోర్డింగుల డిజైన్లను అందజేస్తామన్నారు. వాటిని వినియోగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల వద్ద హోర్డింగులను ఏర్పాటు చేసి తద్వారా ఓటర్ల అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రతిపాదనలకు చమురు కంపెనీల ప్రతినిధులు అంతా సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని హోమీ ఇచ్చారు. అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యుటీ సీఈవో ఎస్.మల్లిబాబు, చమురు పరిశ్రమల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త మరియు డిప్యుటీ జనరల్ మేనేజర్ జె.సంజయ్ కుమార్, హెపిసిఎల్ ఛీప్ రీజనల్ మేనేజర్ ఆదిత్య ఆనంద్, ఐఓసిఎల్ ప్రతినిధి ఎ.అనిల్ కుమార్, బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ ప్రసాద్ రాజ్వాడే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.