తణుకు బ్యూరో ప్రతినిధి : రాష్ట్రంలో అందరి మేలు కోరుకునే ఒకే ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. అసెంబ్లీ సీట్లలో అయితేనే, నామినేటెడ్ పోస్టుల్లో అయితేనే కాపులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. అటువంటి నేతకు కాపులంతా అండగా నిలబడి మరొక్కసారి సీఎంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు.
కాపు జాతి కోసం ప్రాణం ఫణంగా పెట్టిన నేత ముద్రగడ : కాపు జాతి కోసం ప్రాణాలు కూడా ఫణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల అన్నారు. ఆయన జీవితాన్ని కాపు జాతికి అంకితం చేశారని, కానీ చంద్రబాబు మాత్రం కాపు ఉద్యమాన్ని అణిచేందుకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేశారని ఆ విషయాన్ని కాపులు గుర్తుంచుకోవాలని కోరారు. అటువంటి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ అంటకాగడం బాధాకరమన్నారు.
యువతకు స్ఫూర్తి ముద్రగడ : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. కాపుల ముద్దుబిడ్డగా గాంధేయవాదంతో కాపు ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించిన ఘనత ముద్రగడకు మాత్రమే దక్కుతుందన్నారు. మీకు మంచి చేసిన వారినే మీరు నమ్ముకోవాలని సూచించారు. కాపుల వల్లనే మా కుటుంబం ఈరోజు ఈ స్థితిలో ఉందని చెప్పడానికి ఎటువంటి బెరుకు లేదని స్పష్టం చేశారు. మంచిగా ఉండే వ్యక్తికి చెడు చేయాలని చూసే వారికి భగవంతుడే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
రంగా, ముద్రగడను ఇబ్బందిపెట్టిన చంద్రబాబు : కాపుల ఆరాధ్యదైవం వంగవీటి మోహనరంగాను అత్యంత దారుణంగా చంపించిన చంద్రబాబు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతోపాటు ఆయన కుటుంబాన్ని సైతం తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు అన్నారు. కాపులంటే అందరినీ కలుపుకుని వెళ్లేవారని, నమ్మకానికి ధైర్యసాహసాలకు పెట్టిందిపేరు కాపులని అన్నారు. కాపులకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. అనంతరం చంద్రబాబు దోషి అనే పుస్తకాన్ని సభలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ అధ్యక్షులు పి.విజయబాబు, రామానుజం, అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణిప్రసాద్, ఎంపీపీ ఆర్. ధనరాజు, మంగెన సూర్య, పైబోయిన సత్యనారాయణ, యిండుగపల్లి బల రామకృష్ణ, మారిశెట్టి శివశంకర్, మారిశెట్టి శేషగిరి, నూకల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.