బాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమే
మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు
కావలిలో ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రత్యేక ప్రతినిధి : అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం అని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్ ఉన్నాడని తెలిపారు.
ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే : ‘‘అందరి ప్రయోజనాలు రక్షించుకునేందుకు, మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా?. మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేది ఈ ఎన్నికలే. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది. జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?’’ అంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు. మ్యానిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?. ‘‘చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తుకురాదు. బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటి లేదు. మ్యానిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, దైర్యం చంద్రబాబుకు ఉందా?. 30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు.. నా గతాన్ని చూసి ఓటేయండని అడగలేరు. మ్యానిఫెస్టోలోని 10 శాతం హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?’’ అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.
నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు : ‘‘ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే పొత్తు ఎందుకు?. ఎన్నికలొస్తే ప్రజలను మభ్యపెడుతూ ముందుకొస్తాడు. బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్య పెడతాడు. పేదవాడికి మంచిచేసానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా?. నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ ఆశీస్సులు కోరుతున్నా. మీ జగన్ ఇంటించికి పౌరసేవలు డోర్ డెలివరీ చేయిస్తున్నాడు. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమేనని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు : 2014లో ఇదే కూటమి ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ గుర్తుందా?. ముఖ్యమైన హామీలు అంటూ మోసపు మాటలు గుర్తున్నాయా?. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు..చేశాడా?. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు. నిర్మించాడా?. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించాం. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. ఇంటింటికి వెళ్లీ చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి. మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు. సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు. నమ్మొద్దని సీఎం జగన్ చెప్పారు.