విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మేమంతా సిద్ధం పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్, వెస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి షేక్ ఆసిఫ్, మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి , మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే, వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సిద్ధం సభకు ఎన్టీఆర్ జిల్లా సిద్ధంగా ఉందని, వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారన్నారు. భారతదేశంలో ఏ పార్టీ నాయకుడు సిద్ధం వంటి సభలను నిర్వహించలేదని, ప్రజలంతా జగన్ మోహన్ రెడ్డికి జేజేలు పలికారన్నారు. ఏప్రిల్ 12న సిద్ధం సభ నిర్వహించే అవకాశం ఉందని, చంద్రబాబు, పవన్, మోడీ వచ్చినా చిలకలూరిపేట సభకు జనం రాలేదన్నారు. మరోసారి జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, ఎన్టీఆర్ జిల్లా వాసులు సిద్ధం సభకోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజలంతా జగన్ ను మళ్లీ సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్టీఆర్ జిల్లాలో ఉగాది తర్వాత జరగబోయే సిద్ధం సభ విజయవంతం చేస్తాముని తెలిపారు.