ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా
అమరావతి, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.34 కోట్లు విలువ చేసే నగదు, ఆభరణాలు ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితుల్ని ఆయన మీడియాకు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తనిఖీల్లో రూ.11 కోట్ల నగదు, రూ.7కోట్లు విలువైన మద్యం, రూ.10 కోట్లు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేశాం. నగదు, మద్యం, వాహనాల స్వాధీనానికి సంబంధించి 3,300 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సి-విజిల్ యాప్ద్వారా ఇప్పటి వరకు 5,500 ఫిర్యాదులు అందాయి. ఎన్నికలకు సంబంధించి 3,040 ఫిర్యాదులను పరిష్కరించాం. నియమావళి ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలపై 1,600, ఎన్నికల కోడ్ ఉన్నా ప్రచారం చేస్తున్న ఘటనలపై 107, అనుమతి లేకుండా ప్రచారంలో వాహనాల వాడకంపై 43, మతపరమైన ప్రచారాలపై 28, నగదు పంపిణీపై 29, మద్యం పంపిణీపై 17 ఫిర్యాదులు వచ్చాయి’’అని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.