వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యం, వీల్ చైర్ కు పరిమితమైన వారు, యుద్ధవీరుల వృద్ధ వితంతులకు ఇంటి వద్దే పంపిణీ
ఎన్ టీ ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ బ్యూరో ప్రతినిధి : భారత ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారుల మార్గదర్శకాల మేరకు ఈనెల 3వ తేది బుధవారం నుండి సామాజిక బద్రతా పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యం, వీల్ చైర్ కు పరిమితమైన, యుద్ధవీరుల వృద్ధ వితంతులకు ఇంటి వద్దే పంపిణీతో పాటు మిగిలిన వారికి పెన్షన్ దారుల సమీపంలోని సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లతో కలెక్టరేట్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 71 వేల మందికి సామాజిక బద్రతా పించన్లను పంపిణీ చేయవలసి ఉందన్నారు. పెన్షన్ పంపిణీపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్లు పంపిణీ చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
మానవతా సమస్యల దృష్ట్యా వికలాంగులకు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నవారికి, మంచం పట్టి వీల్ చైర్ కు పరిమితమైన వారికి, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేయాలన్నారు. మిగిలిన వారికి వారు నివాసం ఉంటున్న సమీపంలోని గ్రామ వార్డు సచివాలయలలో అందజేయాలన్నారు. పెన్షన్లు అందజేయడంలో కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలని ఈ విషయంలో మరెవరి జోక్యం ఉండరాదని ఎన్నికల ప్రవర్తన నియమావళి రాష్ట్ర ఉన్నతాధికారుల మార్గదర్శకాలు ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించి విమర్శలకు తావులేకుండా పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. టెలి కాన్ఫరెన్స్ లో నగరపాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డి ఆర్ డి ఎ పిడి కె. శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు ఉన్నారు.