వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు
గుంటూరు : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు భిన్నం అని, పెత్తందారీ ప్రయోజనాల కోసం పని చేసే కిరాయి వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. పేదవర్గాలంతా కూలోళ్లుగానే బతకాలన్నది చంద్రబాబు అహంకారమని, ఎస్పీలు, బీసీల్నీ పదే పదే అవమానించి, టిప్పర్ డ్రైవర్లకు వైఎస్సార్సీపీ సీట్లు ఇస్తోందా అని వ్యాఖ్యానించిన అహంకారి బాబును క్షమించే ప్రసక్తే లేదన్నారు. సోమవారం జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడారు.
విభిన్న ప్రచారశైలిలో పెత్తందారీ పార్టీలు : ప్రస్తుత ఎన్నికల రణరంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లల్లో పేదల పక్షాన నిలబడి తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను, చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలను చెప్పుకుంటూ పోతుంది. కానీ, ఏరోజూ పేదలను పట్టించుకోనటు వంటి అవతల వర్గం మాత్రం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పెత్తందారీ పోకడలతోనే ప్రచారంలో ఉంది. ముగ్గురు కలిసినా ప్రజలు వాళ్లను ఆదరిస్తారో లేదో కూడా అర్ధం కానటు వంటి పరిస్థితి. అందువల్ల ఆ పార్టీలు ఒకరికొకరు సఖ్యత లేకుండా అవతలగానే ఉండిపోతున్న స్థితి. పేదల కష్టసుఖాలు, వారి ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే.. మిగతా పార్టీల ఎన్నికల ప్రచారశైలి మాత్రం ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా భిన్నంగా ఉందన్న సంగతి చూస్తున్నామన్నారు.
పెత్తందార్ల ప్రయోజనాల కిరాయి వ్యక్తి చంద్రబాబు : పెత్తందారీ ప్రయోజనాల కోసం ఒక కిరాయి మనిషిలా చేతల్లోనే కాకుండా మాటల్లోనూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మొన్న శింగనమల అభ్యర్థి వీరాంజనేయులను ఉద్దేశించి టిప్పర్ డ్రైవర్‌కు సీటిచ్చి నిశానీలుగా వారిని వాడుకుని, వాళ్లద్వారా సంతకాలు పెట్టించుకుని వైఎస్ఆర్సీపీ ఏలాలని చూస్తుందంటూ ఎగతాళి చేశారు. అదే మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా సహస్ర వృత్తులు టిప్పర్ డ్రైవరైనా, ప్లంబర్, మేసన్, వెల్డర్, కుమ్మరి, చాకలికి గానీ, అనేక వత్తులకు గౌరవం తేవడానికి కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్లనటువంటి ఈ వర్గాలను చట్టసభల్లో నిలబెట్టి వాళ్ల వర్గాల తరపున వారు మాట్లాడుకునేలా చూడాలని ఆయన తపిస్తున్నారన్నారు.
బాబూ..నీకూ సీఎం జగన్‌కు ఉన్న వ్యత్యాసమిది : రెండెకరాలతో రాజకీయం మొదలుపెట్టి లక్షల కోట్లకు నువ్వు ఏ విధంగా ఎదిగావో అందరికీ తెలుసు. ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీలు ఏనాడూ దృష్టి పెట్టలేదు. అయితే, నువ్వు మాత్రం దళితులు, బీసీలు, మైనార్టీ వర్గాల్లోని పేదలంతా మీ చెప్పుచేతల కింద మోచేతి నీళ్లు తాగుతూ బతకాలని కోరుతున్నావు. ఏంటి మీ పెత్తందారీ అహంకారం..? మీతో సరిసమానంగా ఉండే హక్కు దళితులకు లేదనుకుంటున్నావా..? ఉన్నా ఉపయోగించుకోరాదని నుకుంటున్నారా.?. ఇప్పుడు మీరునుకుంటున్న పెత్తందారీ పోకడలకు కాలం చెల్లింది. మాకు కొండంత అండగా వై.ఎస్ జగన్ ఉన్నారు. అదే నీకూ..మా జగన్ మధ్య ఉన్న వ్యత్యాసం అన్నారు.
మేం బాగు పడితే మీకెందుకంత కడుపుమంట? : పేద కుటుంబాల పిల్లలకు చదువు ఖరీదు కాకూడదని అమ్మ ఒడి ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందించే ప్రభుత్వాన్ని అవహేళన చేస్తావా చంద్ర బాబూ..? ఉచిత విద్యను అందించే బడులను బాగుచేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బూట్లుతో పాటు తరగతి గదుల్లో ఇంగ్లీషు పాఠాలు చెబుతుంటే.. పేదలకు ఇంగ్లీషు బోధన అవసరమా.? అంటూ కోర్టులకెళ్లి మరీ అడ్డుకుంటావా..? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ట్యాబ్‌లిస్తే మీకంత కడుపు మంట ఎందుకు..? అని ప్రశ్నించారు.
పేద వర్గాలకు కొండంత అండగా సీఎం జగన్ : మా నాయకుడు వైఎస్ జగన్ మొదట్నుంచీ ఒక విషయం పదేపదే చెబుతున్నారు. పేదలు,పెత్తందారీ వర్గం మధ్య జరుగుతోన్న యుద్ధమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. రూ.2.70 లక్షల కోట్లను పేదల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించి పేదవర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి జగన్. బ్యాంకు అకౌంట్లు పెత్తందారీ అగ్ర వర్ణాలకే కాదు. దళిత, బీసీ, మైనార్టీలకూ ఉంటాయని, అకౌంట్లలో డబ్బులు నేరుగా జమ అవుతాయని నిరూపించిన పేదల పక్షపాతి ప్రభుత్వం ఇదన్నారు.
మా సంక్షేమం జోలికొస్తే ఊరుకోబోం : చంద్రబాబూ బహిరంగ సభల్లో నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమౌతుందా..? నీకు పిచ్చి పట్టిందో, వయస్సు పెరిగి చాదస్తం పెరిగిందో, లేదంటే, ఎన్నికలవగానే పారిపోదామనుకుంటున్నావో అర్ధం కావట్లేదు. కానీ, మా నాయకుడు జగన్ గారు చేస్తోన్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల జోలికొస్తే మాత్రం దళిత, బీసీ, మైనార్టీల వర్గాలు ఊరుకోరు. మిమ్మల్ని, మీతో పాటు వచ్చే పార్టీలను తరిమి తరిమి కొడతారన్నారు.
తండ్రీకొడుకులకు పరిపాలనా అర్హతే లేదు : పేదవాడికి , బడుగు బలహీనవర్గాలకు చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత లేదని నువ్వంటే నీకూ, నీ కొడుకుకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత మీకెక్కడిదని చంద్రబాబు, లోకేశ్‌లను అడుగుతున్నాను. నీ కొడుకు ఎమ్మెల్యేగా గెలవలేక దొడ్డిదారిన మంత్రిపదవిలో కూర్చొని ఏం చేశాడు..? అతనికి ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్థాయి ఎంత.? పరిపాలన, పేదల బతుకుల పట్ల అతనికున్న అవగాహనేంటి.? 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన పరిపాలన ఏంటి.? మీ పరిపాలనలో మీ కులస్తులు, మీకు కొమ్ముకాసే అగ్రవర్ణాలు తప్ప ప్రయోజనాలు పొందిన వారెవరు.? ప్రజలు అన్నీ గమనించారు కాబట్టే 2019లో మిమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేశారు.అయినా మీ వైఖరి మారలేదు. అందుకే రాష్ట్రంలో పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా మీపై తిరగబడే రోజులొచ్చాయన్నారు.