నాడు, నేడు చంద్రబాబు స్వార్థం కోసమే బీజీపీతో పొత్తు
కూటమి తరపున బీసీకి సీటు ఇస్తామని మోసం చేశారు
విజయవాడ ఎంపీ కేశినేని నాని
విజయవాడ పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్‌తో కలిసి 56వ డివిజన్లో విస్తృత ప్రచారం
విజయవాడ, ప్రధాన ప్రతినిధి : చంద్రబాబు తన స్వార్థం కోసమే 2014 తోపాటు ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. కేవలం తాను, తన కుమారుడు చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలో చేరారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును కుభేరుడు సుజనా చౌదరికి అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్‌తో కలిసి కేశినేని నాని సోమవారం 56వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ, జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి నాడు తనతోనే అవిశ్వాస తీర్మానం పెట్టించారని గుర్తుచేశారు. అటువంటి బీజేపీతో మళ్లీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. రాజధానికి రూ.లక్ష కోట్లు ఇస్తామని, రైల్వే జోన్ ఏర్పాటుచేస్తామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు ఇస్తామని ఏమైనా బీజేపీ హామీ ఇచ్చిందా అని నిలదీశారు. విజయవాడ పశ్చిమ సీటును బీసీలకు ఇస్తామని మొదటి నుంచి చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడ పనిచేస్తున్న జనసేన బీసీ నాయకుడిని మోసం చేశారని విమర్శించారు. కూటమి పేరుతో సుజనా చౌదరికి పశ్చిమ సీటును అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతం నుంచి రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్లు, కేంద్ర మంత్రిగా మూడేళ్లు ఉన్న సుజనా చౌదరి విజయవాడకు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఒక్క పని చేయలేదని, కనీసం స్థానిక ప్రజలకు అందుబాటులో కూడా లేరని చెప్పారు. ఆయన వల్ల విజయవాడకు, రాష్ట్రానికి జరిగిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే దానిని చెప్పి అప్పుడు నియోజకవర్గంలో అడుగు పెట్టాలని నాని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పార్టీలో మొదటి నుంచి ఉన్న స్థానికుడైన సామన్య కార్యకర్త ఆసిఫ్‌కు సీటు ఇవ్వడం గొప్ప వషయమని కొనియాడారు. స్థానికంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న ఆసిఫ్‌ను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారానికి కృషి చేస్తారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని, ప్రతి ఒక్కరూ స్థానికుడైన ఆసిఫ్‌కు ఓటు వేయాలని కోరారు.
పేదలను ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు లక్ష్యం : వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్
రాష్ట్రంలోని పేదలను ఇబ్బంది పెట్టడం, పెత్తందారులకు మేలు చేయడమే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యమని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. తాజాగా వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకూడదు. సంక్షేమ పథకాలు పేదల ఇంటి వద్దకు వెళ్లకూడదనే దుర్మార్గపు ఆలోచనతో తన మనుషులతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారని తెలిపారు. దాని ఫలితంగానే ఇవాళ ప్రతి అవ్వాతాత, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర సామాజిక పింఛనుదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు కుటిల రాజకీయాల వల్ల తమకు పింఛన్లు ఎప్పుడు ఇస్తారోనని, గతంలో మాదిరి ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని లబ్ధిదారులు భయపడుతున్నారని చెప్పారు.. పింఛను మాత్రమే కాదు. ఏ ఒక్క పథకం కూడా ఆగదని, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పెత్తందారుల ప్రతినిధి, వలస నేత సుజనా చౌదరిని ఓడించి ఆయనతోపాటు చంద్రబాబు కూడా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పోరేటర్లు యలకల చలపతిరావు, మహాదేవ్ అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, కొట్టిరెడ్డి, చైతన్య రెడ్డి, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.