లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం ఇస్తున్నాం
ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించాం
గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి
రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు అండగా ఉన్నాం
నాడు-నేడుతో బడుల రూపురేఖలు మారాయి
ప్రతీరంగంలో.. ప్రతీ దశలోనూ మార్పు కనిపిస్తోంది
మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి
కర్నూలు నుంచి ప్రత్యేక ప్రతినిధి : గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఎన్నిలక ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. తుగ్గలి, రాతన పరిధిలో 10 వేల జనాభా ఉంది. ఈ రెండు గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశాం. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ, వైఎస్సార్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశాం. బటన్ నొక్కడం ద్వారా నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95 శాతం ఇళ్లకు లబ్ధి చేకూరింది. తుగ్గలిలో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. జగన్నన్న విద్యాదీవెన ద్వారా రెండు గ్రామాలకు రూ.2 కోట్లకు పైగా నిధులు అందించాం. ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో రూ. 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశాం. రాతన గ్రామానికి పథకాల రూపంలో రూ. 26 కోట్లు 59 లక్షలు అందజేశామని సీఎం జగన్ చెప్పారు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నా మని,వలంటీర్ల ద్వారా ప్రతీ పథకం ఇంటి వద్దకే అందేలా చూస్తున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా చేరికలు : పత్తికొండ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కీలక నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వై.నారాయణ, మాజీ ఎంపీపీ, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె కొల్లప్ప, టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ టి సత్యప్ప, జనరల్ సెక్రటరీ(కంబదూరు) పి ఆనంద్ చౌదరి, కళ్యాణదుర్గం రూరల్ జనరల్ సెక్రటరీ కె మల్లిఖార్జున, జనరల్ సెక్రటరీ(శెట్టూరు) ఆదిశేషు, కళ్యాణదుర్గం రూరల్ ఎంపీటీసీ బి. ఓబయ్య, కంబదూరు మాజీ జెడ్పీటీసీ అభ్యర్ధి మంజునాథ్ చౌదరి, శెట్టూరు మాజీ మండల పార్టీ కన్వీనర్ పి రంగనాథ్ శెట్టి పార్టీలో చేరారు.