సరిహద్దు రాష్ట్రాల చెక్కు పోస్టుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయండి
వీటిని సరఫరా చేసే కింగ్ పిన్లను గుర్తించి పిడి యాక్టు కింద్ అరెస్టు చేయాలి
నిఘాను కేవలం చెక్ పోస్టులకే పరిమితం చేయక ఇతర మార్గాల్లోను నిఘా ఉంచండి
ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయం చూపాలి
మాదకద్రవ్యాల నియంత్రణను ఎన్నికల వరకే పరిమితం చేయక పూర్తిగా నివారించండి
మాదకద్రవ్యాల సేవనంతో కలిగే దుష్పరిణామాలపై యువత,విద్యార్దుల్లోను అవగాహన కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి సాగు, ఇతర మత్తు పదార్ధాల రవాణా,విక్రయ దారులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీస్ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఎక్సైజ్ , స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను అక్రమ మద్యాన్ని, గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరా,వాడకంపై ఉక్కు పాదం మోపాలని ఆయా విభాగాల అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు గాను సరిహద్దు రాష్ట్రాల డిజిపిల సమన్వయంతో వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్లను గుర్తించి వారిని పిడి యాక్టు కింద అరెస్టు చేయాలని ఆదేశించారు.అదే విధంగా సరిహద్దు రాష్ట్రాల చెక్కు పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని చెప్పారు.నిఘాను కేవలం చెక్కు పోస్టులకే పరిమితం కాకుండా ఆయా గ్రామాల్లోని ఇతర మార్గాలు,సోర్సులపై కూడా నిఘాను ముమ్మరం చేసి దీనిలో భాగస్వాములైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగుచేసే గిరిజనులకు ఆపరేషన్ పరివర్తన కింద గంజాయి సాగుకు ప్రత్యామ్నయంగా ఇతర పంటల సాగుకు ప్రోత్సంహించాలని పోలీస్, ఎక్సైజ్,సెబ్ విభాగాల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. అక్రమ మద్యం,మాదక ద్రవ్యాల రావాణా,వినియోగం నియంత్రణ చర్యలు కేవలం ఎన్నికల వరకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో నియంత్రించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం ముఖ్యంగా చీఫ్ లిక్కర్ తీసుకువచ్చే అవకాశాలున్నందున సరిహద్దు రాష్ట్రాల చెక్కు పోస్టులతో పాటు రాష్ట్రంలో గల అన్ని చెక్కు పోస్టుల్లోను నిఘాను అధికం చేసి అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివిధ స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రజల్లో ముఖ్యంగా యువత, విద్యార్ధుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో కమీషనర్ యం.రవిప్రకాశ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 రాష్ట్రాలతో అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగి ఉందని తెలిపారు.గంజాయికి సంబంధించి 90 శాతం ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా నుండి,10శాతం కోరాపుట్ జిల్లాల నుండి రాష్ట్రంలోకి రవాణా జరుగుతోందని వివరించారు.ఒడిస్సా డిజిపి వారి సమన్వంయంతో గంజాయి రవాణా నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.గంజాయి రవాణాకు సంబంధించి రాష్ట్రంలో 35 మంది కింగ్ పిన్లను గుర్తించగా వారిలో 25 మందిని అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారని సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహకారంతో వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.అలాగే నార్కోటిక్స్ బ్యూరో సహకారంతో గంజాయి ఇతర మత్తు పదార్ధాల రవాణా నియంత్రణపై తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఎన్నికల నేపధ్యంలో వివిధ రకాల సీజర్స్ పై వివరిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమాళి అమలులోకి వచ్చాక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 4కోట్ల 38 లక్షల రూ.ల విలువైన అక్రమ మద్యం,డ్రగ్సు,ఇతర వస్తువులన స్వాధీనం చేసుకోగా ఈఏడాది ఇప్పటి వరకూ 57 కోట్ల 80 లక్షల రూ.లు విలువైన వివిధ మద్యం,డ్రగ్స్,ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఎక్సైజ్ శాఖ కమీషనర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మద్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రంలో 17 ప్రైమరీ డిస్టిల్లరీలు,20 ఐఎంఎఫ్ఎల్,4 ఇతర డిస్టిల్లరీలు ఉన్నాయని ప్రతి డిస్టిల్లరీకి ఒక సహాయ కమీషనర్ స్థాయి అధికారిని ఇన్చార్చిగా పెట్టామని వివరించారు.అలాగే సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు ఉంటుందని మద్యం రవాణా చేసే వాహనాలను జిపిఎస్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతోందని తెలిపారు.తయారైన మద్యం సక్రమంగా ఆయా డిపోలకు చేరేలా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు.అక్రమ మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమీషనర్ దేవ కుమార్, ఎపి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రావు పాల్గొన్నారు. వర్చువల్ గా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ, విశాఖపట్నం, విజయవాడ జిల్లా కలెక్టర్లు,పోలీస్ కమీషనర్లు డా.మల్లిఖార్జున, ఢిల్లీ రావు, రవి శంకర్ అయ్యన్నార్,కాంతి రాణా టాటా ,ఎఎస్ఆర్,అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు విజయ సునీత, రవి సుభాష్, ఎస్పిలు తుహిన్ సిన్హా, మురళీ కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.