ఈ చిన్నోడు చేసినంత ఆ ముసలాయన చేయలేకపోయాడు
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి అనుభవం మీ జీవితాలు మార్చిందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి
నంద్యాల నుంచి ప్రత్యేక ప్రతినిధి : అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కి నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన ఆయన రెండో రోజైన గురువారం ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఎక్కడా లంచాలు, ఎక్కడా వివక్ష లేవు. ఏ పార్టీ అని చూడకుండా అర్హత ఉంటే చాలూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93 శాతం మంది లబ్ధి పొందారు అని సీఎం జగన్ వివరించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని స్వయంగా ఆయన గణాంకాలతో వివరించారు. అమ్మ ఒడి కింద ఒక్క ఎర్రగుంట్లలో 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది. రూ. 4.69 కోట్లు అందించారు. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 3 కోట్లకు పైగా అందించారన్నారు.
మన భవిష్యత్తు కోసం ఓటేయాలి : ఎర్రగుంట్లలో ఆరోగ్యశ్రీ కింద రూ. 2 కోట్లకుపైగా అందించారని, ఎర్రగుంట్లలో 1,496 ఇళ్లకుగానూ 1391 ఇళ్లకు లబ్ధి చేకూరిందన్నారు. ఎర్రగుంట్లలో చేదోడు కింద రూ. 31.20 లక్షలు అందించారని, మొత్తంగా ఎర్రగుంట్లకు ఈ 58 నెలల కాలంలో రూ. 48.74 కోట్లు అందించారని, ఎర్రగుంట్లలో 93.06 శాతం మందికి సంక్షేమం అందిందన్నారు. నా కంటే ముందు చాలామంది సీఎంలుగా చేశారు. నా కన్నా వయసు, అనుభవం ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చేశారు. నా కంటే ముందు 75 ఏళ్ల వయసున్న ఓ ముసలాయన కూడా పరిపాలన చేశాడు. వయసులో నేను చాలా చిన్నోడిని. ఈ చిన్నోడిగా అడుగుతున్నా. 14 ఏళ్లు ముఖ్యమంత్రి గా చేసిన ఆ వ్యక్తి అనుభవం మీ జీవితాలు మార్చిందా?. ఆలోచన చేయండి. ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయండని సీఎం జగన్ ఎర్రగుంట్ల ప్రజలను కోరారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయని, ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు నాడు-నేడుతో మారిపోయాయన్నారు. మీ బిడ్డ పాలనలో మార్పు ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించండి. ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు. మన భవిష్యత్తు కోసం ఓటేయాలి. జరిగిన మంచిని చూసి ఓటేయండని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎర్రగుంట్ల ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో వికలాంగుడైన లబ్దిదారుడు ప్రసాద్ మాట్లాడుతూ నేను, నా భార్య వికలాంగులం. మాకు పెన్షన్ ఆరు వేలు వస్తోంది. జగనన్న అందిస్తున్న సాయం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. జగనన్న మేలు మా జీవితంలో మరిచిపోలేం. సీఎం జగన్ గొంతులా మిమిక్రీ చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. మరో లబ్ధిదారుడు మాట్లాడుతూ తన కుమారుడికి ఆరోగ్య శ్రీ కింద ఎంతో మేలు జరిగింది. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చేయాల్సిన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగింది. దీంతో, నా కుమారుడు మీ దయతో ఆరోగ్యంగా ఉన్నాడు. దేశంలోనే నెంబర్ వన్ సీఎం జగన్ అని కితాబిచ్చారు.
ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మాట్లాడుతూ మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నందున అందరూ రకరకాల జిమ్మిక్కులతో పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నారు. సీఎం జగన్ 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వస్తే రైతు భరోసా, అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలతో నవరత్నాలను ప్రకటించారు. ఆ పాదయాత్రలో మీ మద్దతు చూరగొని 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ నేరుగా మీకే అందించారు. గత ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందివ్వకపోగా దాదాపు 650 హామీలను ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా మనం ఒకటే చెబుతున్నాం మాకు అధికారం ఇస్తే మీ గ్రామాలను మారుస్తాం, మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు చేయూత అందిస్తామని ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తామని కోరుతుంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో గమనించండి. ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన చేయాలి. ఇంకొకడు మేం అధికారంలోకి వస్తే మీరు గుడుల్లో, బడుల్లో దాచి పెట్టుకోవాలంటాడు. మేం కూడా ఆళ్లగడ్డ వాళ్లమే, గుడుల్లో, బడుల్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాదు. కలలు మానుకోండి. అధికారంలోకి వచ్చేది వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎగిరేది వైఎస్సార్ కాంగ్రెస్ జెండా అన్నారు.
జనం కోసం నిలబడిన జగనన్న : వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈ రోజే ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ జనం కోసం నిలబడినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పులో, పాదయాత్రలో మన నుంచి విన్నారు. దాని ఫలితం ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. ఇప్పుడు మళ్లీ వినడానికి వచ్చారు. పేదల కోసం పెత్తందారులందరితో యుద్ధం చేస్తున్నారు. అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నిలబడాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో అన్న వినడానికి వచ్చారన్నారు.